బోరులో నీరు తగ్గిపోవడంతో మామిడి చె ట్లు ఎండిపోతుండటం చూసి తట్టుకోలేక ఓ రైతు 250 చెట్లను నరికివేశాడు.
గుత్తి రూరల్, న్యూస్‌లైన్ : బోరులో నీరు తగ్గిపోవడంతో మామిడి చె ట్లు ఎండిపోతుండటం చూసి తట్టుకోలేక ఓ రైతు 250 చెట్లను నరికివేశాడు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతాపల్లికి చెందిన వీర భాస్కర్‌కు ఐదెకరాల పొలం ఉంది. పదేళ్ల క్రితం 250 మామిడి మొక్కలు నాటాడు. పంటకు నీటి సౌకర్యం కల్పించేందుకు మొదట ఒక బోరు వేశాడు. కొన్ని రోజులకే అందులో నీళ్లు తగ్గిపోవడంతో మరొక బోరు తవ్వించాడు. అలా ఒక దాని తర్వాత మరొకటి నీళ్లు అడుగంటినప్పుడల్లా బోర్లు వేయిస్తూ వచ్చాడు.
మొత్తం 15 బోర్లు 250 అడుగులు వేయించగా రెండింటిలో మాత్రమే అరకొరగా నీరు వస్తోంది. ఈ నీరు చెట్లకు సరిపోవడం లేదు. దీనికితోడు ఇంతవరకూ పూర్తి స్థాయిలో కాపు రాలేదు. ప్రస్తుతం నీరందక చెట్లు ఎండిపోవడం.. పూత, పిందె రాలిపోవడంతో ఏం చేయాలో భాస్కర్‌కు పాలుపోలేదు. మరో వైపు పెట్టుబడులు.. బోర్ల తవ్వకం కోసం చేసిన అప్పులు రూ.6 లక్షలకు చేరుకోవడంతో.. ఇక ఈ పంట వల్ల లాభం లేదని భావించి శనివారం 250 చెట్లనూ నరికేయించాడు.