282వ రోజు పాదయాత్ర డైరీ | 282rd day padayatra diary | Sakshi
Sakshi News home page

282వ రోజు పాదయాత్ర డైరీ

Published Wed, Oct 10 2018 3:49 AM | Last Updated on Wed, Oct 10 2018 7:00 AM

282rd day padayatra diary - Sakshi

09–10–2018, మంగళవారం
జిన్నాం, విజయనగరం జిల్లా

మీ వల్ల మోసపోని ఒక్క కులమైనా, వర్గమైనా ఉందా బాబూ?
ఈ రోజు చీపురుపల్లి నియోజకవర్గం దాటి గజపతినగరంలోకి ప్రవేశించాను. చిన్నచిన్న ఇరుకైన రోడ్ల మీద పాదయాత్ర సాగింది. ఈ గ్రామాలకు బస్సు సౌకర్యమే లేదు. ఆస్పత్రులకు వెళ్లాలన్నా, పిల్లలు బడులకెళ్లాలన్నా నానా అవస్థలు పడాల్సిందే. లోగిశ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు కలిసి తమ స్కూల్‌ సమస్యలు చెప్పారు. నాసిరకం బియ్యం, చెడిపోయిన గుడ్లతో మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంటోందని అన్నారు. ‘స్కూల్‌లో ఫ్యాన్లు లేనే లేవు.. బెంచీలు అంతంత మాత్రమే.. మరుగుదొడ్లకు పోయే పరిస్థితే లేదు’ అంటూ వాపోయారు. ఈ ప్రభుత్వానికి కార్పొరేట్‌ స్కూళ్లపై ఉన్న ప్రేమలో కాస్తంతయినా ప్రభుత్వ పాఠశాలలపై ఉంటే ఈ దుస్థితి ఉండేది కాదేమో.
 
ముచ్చర్ల గ్రామంలో వడ్రంగుల కష్టనష్టాలు విచారించాను. ఆ వృత్తిని కొనసాగించడం వారికి భారమైపోతోంది. కలప రేట్లు పెరిగిపోయాయి. కరెంటు చార్జీలు భారమయ్యాయి. నాన్నగారి హయాంలో రూ.300 దాటని కరెంటు బిల్లులు ఇప్పుడు ఏకంగా రూ.1000 దాటుతున్నాయి. పనిముట్లు కొందామంటే పెట్టుబడి కష్టమైపోతోంది. ఎలాంటి లోన్లు అందడం లేదు. కులవృత్తి మాని కూలికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోందని ఆ వడ్రంగి సోదరులు వాపోయారు.
 
మధ్యాహ్నం వినిత, నవిత అనే అక్కాచెల్లెలు కలిశారు. వారిద్దరికీ పుట్టుకతోనే మూగ, చెవుడు. పేదింట్లో ఆడబిడ్డలు వైకల్యంతో పుట్టడంతో వారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. వారి భవిష్యత్‌ను తలుచుకుని కుమిలిపోయారు. అలాంటి సమయంలో నాన్నగారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. దాదాపు రూ.18 లక్షల విలువైన కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్లు ఉచితంగా చేయించారు. ఇప్పుడు వారిద్దరూ చక్కగా మాట్లాడుతున్నారు.. బడికెళ్తున్నారు. వారిని చూసి చాలా ఆనందమేసింది. కానీ ఆ పిల్లల వినికిడి పరికరాల నిర్వహణకు ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.30 వేలు ఖర్చవుతుందట. అంతటి భారాన్ని ఆ పేద తల్లిదండ్రులు ఎలా మోయగలరు? అందుకే ఆ నిర్వహణ ఖర్చును సైతం ఆరోగ్య శ్రీ పరిధిలోకి తేవాలన్న తలంపు మరింత బలపడింది.  

లోగిశ, జిన్నాం గ్రామాల్లో ఎంతోమంది తమకు అన్ని అర్హతలున్నా పింఛన్లు ఇవ్వడంలేదని మొరపెట్టుకున్నారు. ఆఖరుకు తమకు న్యాయంగా రావాల్సిన పెన్షన్ల కోసం పేదలు కోర్టులకెళ్తున్నారంటే ఈ ప్రభుత్వానికి అంతకన్నా సిగ్గుచేటైనా విషయం ఏముంటుంది? రాములమ్మ అనే దళిత మహిళకు భర్త చనిపోయి రెండేళ్లు దాటింది. చూసుకునేవారు ఎవరూ లేక ఒంటరిగా బతుకుతోంది. వితంతు పింఛన్‌ కోసం కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేదట. పొట్టకూటి కోసం ఉపాధి పనులు చేస్తే ఆ డబ్బులూ ఇవ్వలేదట. గత్యంతరం లేక గోదావరి జిల్లాలకు కూలి పనుల కోసం వలస పోతున్నానని చెబుతుంటే చాలా బాధేసింది. ఇలాంటి వారిని ఆదుకోని పథకాలెందుకు? ప్రభుత్వాలెందుకు?  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. అన్ని చేతివృత్తులు, కులవృత్తుల వారిని ఆదరణ పథకంతో ఆదుకుంటానని మేనిఫెస్టోలో మీరిచ్చిన హామీ ఏమైంది? మీ ఓటు బ్యాంకు రాజకీయాలతో బలహీనవర్గాల ప్రజలకు హామీలిచ్చి మోసం చేయడం నిజం కాదా? మీవల్ల మోసపోని ఒక్క కులమైనా, వర్గమైనా ఉందా?
-వైఎస్‌ జగన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement