శ్రీనివాసులు-అమర్ నాథ్ రెడ్డి- శ్రీకాంత్
కడప(వైఎస్ఆర్ జిల్లా): రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరుకు నిరసనగా వైఎస్ఆర్ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఆమరణ దీక్షకు కూర్చున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారే. వీరందరూ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు కూడా చేశారు. రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ మూడు రోజుల క్రితమే ఇక్కడ ఆమరణదీక్ష ప్రారంభించారు. ఆయనతోపాటు మాజీ మేయర్ పి. రవీంద్రనాథ్ రెడ్డి, హఫీజుల్లా, అల్లాడు పాండురంగారెడ్డి, సంపత్ కుమార్లు కూడా ఆమరణదీక్ష చేస్తున్నారు. వీరి దీక్ష నాలుగవ రోజుకు చేరింది.
రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డి రాజంపేటలో, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు రెడ్డి రైల్వేకోడూరులో ఈరోజు ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నారు. ఈ జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగవ ఎమ్మెల్యే, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా ఈ నెల 19 నుంచి విజయవాడలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టనున్నారు. రాష్ట్ర విభజన తప్పనిసరైతే రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలని ఆ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఇందుకోసమే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఆమరణదీక్షకు కూర్చొని ఉద్యమానికి ఊపునిస్తున్నారు.
ఇదిలా ఉండగా, మూడు రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డిల ఆరోగ్యం క్షీణించింది.