326వ రోజు పాదయాత్ర డైరీ | 326th day ys jagan padayatra diary | Sakshi
Sakshi News home page

326వ రోజు పాదయాత్ర డైరీ

Published Fri, Dec 21 2018 1:41 AM | Last Updated on Fri, Dec 21 2018 2:13 PM

326th day ys jagan padayatra diary - Sakshi

సామాన్యులు స్వేచ్ఛగా జీవించే  హక్కు కూడా హరించాలనుకోవడం ఎంత ఆటవికం?

ఈరోజు కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల్లో పాదయాత్ర సాగింది. మంత్రి గారు, ఆయన అనుచరుల అరాచకాల మీద రోజంతా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నిన్న రాత్రి బస చేసిన రైస్‌మిల్‌ యజమాని, ఆయన కుటుంబీకులు వచ్చి కలిశారు. బసకు చోటిచ్చినందుకు వారింటికి వెళ్లి మరీ బెదిరించారట. మిల్లును, వ్యాపారాన్ని దెబ్బ కొడతామని హుంకరించారట. అయినా అభిమానం ముందు ఆ బెదిరింపులేవీ పనిచేయలేదు.   మంత్రి గారి స్వగ్రామం నిమ్మాడ గ్రామస్తులు కలిశారు. నిరుపేద ఎరకయ్యకు ఉన్న ఒకే ఒక ఎకరా భూమికి దారి లేకుండా చేసి సెల్‌ఫోన్‌ టవర్‌ పెట్టి సొమ్ము చేసుకుంటున్నారట.  మంత్రి గారి అడుగులకు మడుగులొత్తలేదని అదే గ్రామంలో 20 కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశారట. వారితో ఎవరూ మాట్లాడకూడదు.. వారి భూములెవ్వరూ సాగు చేయకూడదు. అమ్మరాదు.. కొనరాదు. ఎటువంటి వ్యాపారాలూ చేయరాదు. ఆఖరికి చాకలి, మంగలి కూడా వెళ్లకుండా ఆంక్షలు విధించారట. ఏ పథకాలు అందకుండా చేయడం, బతుకుదెరువే లేకుండా చేయాలనుకోవడం విస్మయం కలిగించింది.

సామాన్యులకు స్వేచ్ఛగా జీవించే హక్కు కూడా హరించాలనుకోవడం ఎంత ఆటవికం?   పాదయాత్రకు వెళితే పింఛన్లు ఆపేస్తామంటూ ప్రజల్ని బెదిరిస్తున్నారని ముద్దపు కవిత అనే సోదరి వాపోయింది. టీడీపీ దుర్మార్గ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్న ప్రజల ఆకాంక్షకు చిహ్నంగా లక్ష్మి అనే సోదరి పావురాలను ఎగురవేయించింది. మరోవైపు మంత్రి గారి సొంత మండలంలోనే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటికి సైతం అల్లాడిపోతున్నారు. ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం ఊసే లేదట. రోడ్లు, మౌలికవసతులే లేవని పల్లెపల్లెనా ప్రజలు మొర పెట్టుకున్నారు. నాన్నగారిచ్చిన కొండపేట, పొడుగుపాడు, కొత్తపేట తదితర చిన్నచిన్న ఎత్తిపోతల పథకాలను సైతం పూర్తి చేయకపోవడంతో తమ పొలాలకు సాగునీరందడం లేదన్నది రైతన్నల వ్యథ. వారి కష్టాలు తీర్చి మంచి చేసి మనసులు గెలవాల్సింది పోయి.. బెదిరింపులు, దౌర్జన్యాలు, మోసాలతో లొంగదీసుకోవాలనుకోవడం మూర్ఖత్వం కాక మరేమిటి?  నేను ఈరోజు నడిచిన దారిలోనే నాన్నగారి పాదయాత్ర కూడా సాగింది. నాడు పాదయాత్రలో ఈ ప్రాంత ఉప్పు రైతుల కష్టాలు చూశారాయన. అధికారంలోకి రాగానే ‘నాలా’పన్ను తీసేసి ఆదుకున్నారని నాన్న గారిని గుర్తు చేసుకున్నారు నౌపడ గ్రామస్తులు. ఉప్పు రైతులకు తుపాను పరిహారమిచ్చిన గొప్ప మనç సు ఆయనదన్నారు.  నాన్నగారి పాదయాత్రప్పుడు ప్రజా వ్యతిరేక పాలనతో ప్రజలు విసుగెత్తిపోతే.. నేడు ప్రజా వ్యతిరేక పాలన, పాలకులే ప్రజాకంటకులై ప్రజలను కాల్చుకుతింటున్న అరాచకం నెలకొంది.

సాయంత్రం వడ్డితాండ్ర వద్ద కాకరాపల్లి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు వ్యతిరేకంగా 3,051 రోజులుగా దీక్షలు చేస్తున్న మత్స్యకారుల శిబిరానికి వెళ్లాను. తరతరాలుగా వారు ఆధారపడి జీవిస్తున్న తంపర భూములను థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు కట్టబెట్టే జీవో నంబర్‌ 1108 రద్దు కోసం పోరాడుతున్నారు. ఆ జీవోను రద్దు చేస్తామని గత ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన బాబు  మోసం చేశారని మండిపడ్డారు. ఓవైపు మేము తంపర భూములపై హక్కులు కోల్పోయి పోరాడుతుంటే.. మరోవైపు మంత్రి గారి బినామీలు అవే భూముల్లో అక్రమ రొయ్యల చెరువులు ఏర్పాటు చేసుకొని దోచుకుంటున్నారని వాపోయారు.ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. తాగడానికి మంచి నీరు లేక, నీటిని కొనలేక కిడ్నీ వ్యాధులు తదితర రోగాల బారినపడతామని తెలిసి కూడా విధి లేని పరిస్థితిలో అక్కడున్న నీటినే తాగుతున్నామని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. ఏమైంది మీ ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం? ఆ పథకం కింద ప్రతి గ్రామానికి రక్షిత నీటి సరఫరా, ప్రతి వీధికి ఉచిత కుళాయి, రూ2.కే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ అంటూ మీ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాల్లో పేర్కొన్నారు. అదైనా గుర్తుందా? ఆఖరికి మీ మేనిఫెస్టో కూడా ప్రజల్ని మోసగించడానికేనా?    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement