ఇప్పటివరకు నడిచిన దూరం: 3,563 కిలోమీటర్లు
30–12–2018, ఆదివారం
రాజంకాలనీ, శ్రీకాకుళం జిల్లా
333వ రోజు నడిచిన దూరం: 12.7 కి.మీ.
వ్యవసాయాధారిత పరిశ్రమలకు ఒక్క ప్రోత్సాహకమైనా ఇచ్చారా?
ఈరోజు వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లో పాదయాత్ర చేశాను. ఈ సందర్భంగా నువ్వలరేవు గ్రామానికి చెందిన కేవిటి కులస్తులు కలిశారు. పదివేల మంది ఉన్న ఈ గ్రామంలో అంతా ఒకే కులస్తులట. ఇది వరకు వాళ్లకు కుల ధ్రువీకరణే లేదు. నాన్నగారు పాదయాత్ర చేసినప్పుడు ఈ పరిస్థితి ఆయన దృష్టికొచ్చింది. వాళ్లు పడే ఇబ్బందులు కళ్లారా చూశారు. అధికారంలోకి రావడంతోనే వాళ్లను బీసీ–ఏ జాబితాలో చేర్చారు. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ వారంతా ఈ రోజు నా వద్దకు వచ్చి కృతజ్ఞతలు చెప్పారు. నిజంగా వాళ్ల ఆచార, వ్యవహారాలు గమ్మత్తుగా అన్పించాయి. గ్రామంలో పెళ్లీడుకొచ్చిన పిల్లలంతా ప్రతి రెండేళ్లకోసారి సామూహిక వివాహాలు చేసుకుంటారట. ఇలా ప్రతి ఇల్లు పచ్చతోరణం కట్టుకోవడం.. ఏక కాలంలో వివాహాలు జరగడం వల్ల వాళ్లకు ఆర్థిక భారం కూడా తగ్గుతోంది. నేస్తరికం పేరుతో వాళ్లు జరుపుకునే వేడుకలు స్నేహపూర్వక ధోరణికి అద్దం పడుతున్నాయి. నిజంగా వాళ్ల సంప్రదాయ ధోరణులు సమాజానికి స్ఫూర్తినిస్తాయనేది నా విశ్వాసం. చేపల వేటే జీవనాధారమైన ఈ కులస్తులనూ సమస్యలు వెంటాడుతున్నాయి. జెట్టీ లేక చేపల వేటే కష్టమైందని.. కోల్డ్‌స్టోరేజీలు లేక దళారుల చేతుల్లో మోసçపోతున్నామన్న వాళ్ల ఆవేదన బాధ కలిగించింది.
ఉదయం పలు యూనివర్సిటీల విద్యార్థి సంఘాల ప్రతినిధులు, అధ్యాపకులు నన్ను కలిశారు. నాలుగేళ్ల టీడీపీ ప్రభుత్వంలో కొత్తగా ఒక్క పోస్టూ భర్తీ చేయలేదని చెప్పారు. యూనివర్సిటీల్లో భర్తీ చేయాల్సిన 2,200 పోస్టులను సైతం కుదించిన వైనాన్ని నా వద్ద ఏకరవు పెట్టారు. ఈ సర్కార్.. ప్రభుత్వ యూనివర్సిటీ విద్యను ఉద్దేశపూర్వకంగా ఎలా నిర్వీర్యం చేస్తోందో వివరించారు. రాష్ట్రంలో ఏడు యూనివర్సిటీలకు వైస్‌చాన్స్‌లర్స్ కూడా లేని దౌర్భాగ్యస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత విద్య పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికిది అద్దం పడుతోందన్నారు. నిజంగా ఇది దారుణమే. ఓవైపు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేస్తూ.. మరోవైపు ప్రైవేటు యూనివర్సిటీలకు ఎర్రతివాచీ పరుస్తున్నారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కూడా తూట్లు పొడుస్తున్నారు. కార్పొరేట్ కొమ్ముగాసే చంద్రబాబు ప్రభుత్వం పేదవాడి విద్యకు సహకరిస్తుందా? ఈ పరిస్థితిని తప్పకుండా మార్చాల్సిన అవసరముంది.
పలాస పేరు వింటే గుర్తుకొచ్చేది జీడిపప్పు. ఇక్కడి ప్రజలు దీన్ని తెల్లబంగారం అంటారు. ఈ ప్రాంతంలో జీడిపిక్కల పరిశ్రమలు మూడొందల వరకు ఉన్నాయి. విదేశస్తులూ ఇక్కడి జీడిపప్పు అంటే ఎంతో మక్కువ చూపుతారు. తిరుపతి లడ్డూలోనూ పలాస జీడిపప్పునే వాడతారని స్థానికులు గర్వంగా చెప్పుకుంటారు. ఎలాంటి ప్రచారం లేకుండా ప్రపంచానికి పరిచయమైన పలాసలో జీడి కార్మికుల తెర వెనుక జీవితం పూర్తిగా అంధకారమని వారి మాటల్లో తెలిసింది. ఇక్కడ జీడి పరిశ్రమను నమ్ముకుని 20 వేల మందికి పైగా బతుకుతున్నారు. నాన్నగారి హయాంలో జీడిపిక్కల పరిశ్రమను వ్యవసాయాధారిత పరిశ్రమగా గుర్తించారు. పన్నులు తగ్గించి ఊతమిచ్చారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు తమ గురించి కలలో కూడా ఆలోచించలేదని జీడి పిక్కల కార్మికులు వాపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యా న్ని నా దృష్టికి తెచ్చారు. కుటీర పరిశ్రమ కింద ప్రోత్సాహకాలిచ్చిన పాపాన పోలేదన్నారు. కార్మి క చట్టాల అమలు.. అందని ద్రాక్షని చెప్పారు. జీడి పిక్కల వలిచే కార్మికుల వేలిముద్రలు పడటం కూడా కష్టమే. ఈ కారణంతో ప్రభుత్వ సంక్షే మ పథకాలు కూడా అందడం లేదని వాపోయా రు. అసలే పరిశ్రమదారులు ప్రభుత్వ నిర్ల క్ష్యంతో కలత చెందుతుంటే.. మరోవైపు స్థానిక టీడీపీ నేతలు ప్రతి కేజీ జీడిపప్పుపై అనధికార సుంకా న్ని ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారట.
ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. మండలానికొక ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్‌స్టోరేజ్, గోడౌన్.. జిల్లాకొక మెగా ఫుడ్‌పార్క్ నెలకొల్పుతామన్నారు. అగ్రికల్చరల్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలను, ఎక్స్‌పోర్ట్ ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. మీ మేనిఫెస్టోలోని ఈ హామీలన్నీ ఏమయ్యాయి? వ్యవసాయాధారిత పరిశ్రమలకు మీరిచ్చిన ఒక్కటంటే ఒక్క ప్రోత్సహకమైనా ఉందా?
- వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment