ఇప్పటివరకు నడిచిన దూరం: 3,574.1 కి.మీ
334వరోజు నడిచిన దూరం: 11.1 కి.మీ
31–12–2018, సోమవారం
దెప్పూరు కూడలి, శ్రీకాకుళం జిల్లా
వారు కన్నీరుమున్నీరవుతుంటే.. నా గుండె బరువెక్కింది
ఈ రోజు కిడ్నీ వ్యాధి పీడితులు, తిత్లీ తుపాను బాధితులు గ్రామగ్రామానా కలిశారు. ఈ రోజు పాదయాత్ర సాగిన వజ్రపుకొత్తూరు మండలంలోనే తిత్లీ తుపాను తీరం దాటింది. ఎటు చూసినా నేలవాలిన పెద్ద పెద్ద కొబ్బరి, జీడి మామిడి చెట్లే కనిపించాయి. తుపాను బీభత్సాన్ని కళ్లకు కట్టాయి. మామిడిపల్లికి చెందిన కూలీపని చేసుకునే జోగారావు అనే అన్న కలిశాడు. తిత్లీ తుపానప్పుడు ఆ గాలులకు పక్కింటి పైకప్పు ఎగిరిపడి ఆయన కాలు తెగిపోయిందట. గంటల తరబడి ఎదురుచూసినా సాయమందని పరిస్థితి. విధిలేని పరిస్థితిలో భుజాలమీద ఎత్తుకుని కిలోమీటర్ల దూరంలో ఉన్న పలాస ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారట. అక్కడ వైద్యం చేయలేమన్నారని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళితే.. ఆరోగ్యశ్రీ వర్తించదన్నారట. లక్షల రూపాయలు అప్పుచేసి వైద్యం చేయించుకోవాల్సి వచ్చిందంటూ ఆ సోదరుడు కంటతడిపెట్టాడు. అధికారుల చుట్టూ, అధికార పార్టీ నేతల చుట్టూ పరిహారం కోసం నేటికీ తిరుగుతూనే ఉన్నాడు.
చినవంక గ్రామస్తులది మరో జాలి కథ.. తిత్లీ తుపాను తర్వాత కొద్ది రోజుల వరకూ ఏ సాయమూ అందని దుస్థితి వారిది. ఆ ఊరికే వచ్చిన ముఖ్యమంత్రిగారికి తమ కష్టాలు చెప్పుకుందామని పోతే ‘నోర్లు మూసుకోండి.. అడ్డొస్తే బుల్డోజర్లతో తొక్కించేస్తా’.. అంటూ బెదిరించాడని వాపోయారు.
విప్లవాల పురిటిగడ్డ.. బొడ్డపాడు గ్రామం సమీపంలో పాదయాత్ర సాగింది. భూమి కోసం.. భుక్తి కోసం.. సాయుధ రైతాంగ పోరాటాలు ప్రారంభమైన గ్రామమది. మామిడిపల్లి, బొడ్డపాడు గ్రామాల మహిళలు కలిశారు. వారంతా జీడి కార్మికులే. చాలామంది 60 ఏళ్లు పైబడ్డ అవ్వలే. జీడి పిక్కలు ఒలిచి.. చర్మమంతా పోయి.. చేతులు నల్లగా పొక్కిపోయాయి. రోజంతా కష్టపడ్డా రూ.130 కూడా గిట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేతులకు గ్లౌజులు కూడా కొనుక్కోలేని దుస్థితి వారిది. చేతి వేళ్లు దెబ్బతినడంతో పింఛనూ, రేషన్‌కు సమస్యే అంటూ కన్నీటిపర్యంతమయ్యారు.
సాయంత్రం గునిపల్లి, మిట్టూరు గ్రామాలకు చెందిన దాదాపు 20 మందికి పైగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు కలిశారు. ఈ నియోజకవర్గంలోనే అత్యధిక కిడ్నీ వ్యాధిగ్రస్తులున్నది గునిపల్లిలోనేనట. దాదాపు ప్రతి ఇంట్లో కిడ్నీ బాధితులున్నారని చెప్పారు. ఆ ఊరంతా మత్స్యకారులే. ఉపాధి కోసం వలసలుపోయి తెచ్చిన సంపాదనంతా.. ఇంట్లో కిడ్నీ బాధితుల చికిత్సకే సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు కిడ్నీ వ్యాధిగ్రస్తులున్న కుటుంబాలూ ఉన్నాయట. రేషన్‌కార్డును బట్టి ఒక ఇంట్లో ఒకరికే డయాలసిస్ చేస్తున్నారట. మరి మిగతావారి పరిస్థితేం కావాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు మందుల్లేక.. మరోవైపు డయాలసిస్ సేవలు సరిగా అందక.. ఇంకోవైపు పింఛన్లు రాక.. వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఈ బాధలుపడటం కన్నా ఆత్మహత్యే మేలని ఓ అన్న కన్నీరుమున్నీరవుతుంటే.. గుండె బరువెక్కిపోయింది.
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ‘ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ప్రతి పీహెచ్‌సీలో మందులు ఉచితంగా అందిస్తాం.. ప్రతి డయాలసిస్ సెంటర్లో ఒక నెఫ్రాలజిస్ట్‌ను నియమిస్తాం’.. అంటూ పలాస బహిరంగ సభలో ప్రకటించారు. రెండేళ్లు దాటిపోయింది.. మరి ఆ హామీ ఏమైంది?
- వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment