ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదివారం రాత పరీక్షలు నిర్వహించనుంది. జిల్లాలోని 83 పోస్టులకుగాను 37,984 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల కోసం జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం డివిజ న్లలో 96 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులు సకాలంలో హాజరుకావాలని, పరీక్ష ప్రారంభమైన పది నిమిషాల వరకు లోపలికి అనుమతిస్తామని, ఆ తర్వాత వచ్చిన అభ్యర్థులను లోనికి అనుమతించేది లేదని అధికారులు చెబుతున్నారు.
ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జనరల్ స్టడీస్, అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు రూరల్ డెవలప్‌మెంట్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు శుక్రవారం చీఫ్ సూపరింటెండెంట్‌లకు, రూట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజనింగ్ ఆఫీసర్లకు ఏపీపీఎస్సీ అధికారి వెంకటాద్రి ప్రత్యేక శిక్షణను ఇచ్చారు. ఇప్పటికే ప్రశ్నాపత్రాలు జిల్లా ఖజానా కార్యాలయంలో భారీ భద్రత మధ్య ఉంచారు. పరీక్షకేంద్రాల వద్ద జిరాక్స్, బుక్‌స్టాల్స్‌ను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలకు అభ్యర్థులు సకాలంలో హాజరయ్యేందుకు ప్రత్యేక బస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మంచినీరు, మెడికల్ కిట్లు అందుబాటు లో ఉంచాలని జేసీ సురేంద్రమోహన్ వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల కోసం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు 22 రూట్లను విభజించారు.
వాటిలో ఖమ్మంలో 77 సెంటర్లకు 17 రూట్లు, కొత్తగూడెంలో 19 సెంటర్లకు 5 రూట్లను ఏర్పాటు చేశారు. పరీక్షలకు ఫ్లయింగ్ స్క్వాడ్‌గా రెవెన్యూ డివిజన్ అధికారులను నియమించారు. జిల్లావ్యాప్తం గా 27మంది లైజన్ అధికారులు, 96 మంది అసిస్టెంట్ లైజన్ అధికారులు, 96 మంది చీఫ్ సూపరింటెండెంట్‌లు, 1739 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఖమ్మంలో 1463 మంది, కొత్తగూడెంలో 276మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఈ పరీక్షల నిర్వహణకు జిల్లా పరిషత్ సీఈఓ జయప్రకాష్ నారాయణను కో-ఆర్డినేటర్‌గా నియమించారు. జిల్లాలో మొత్తం 16మంది అంధులు పరీక్షలకు హాజరవుతున్నారు.
వారిలో ఆరుగురు కొత్తగూడెంలో, పదిమంది ఖమ్మంలో పరీక్షలు రాయనున్నారు. వీరికి లేఖకులను సహాయం గా తెచ్చుకునే అవకాశం కల్పించారు. అయితే పరీక్షకేంద్రాల్లో అదే పాఠశాలలు, కళాశాలలకు చెందిన సిబ్బందిని ఇన్విజిలేటర్లుగా నియమించారని, అక్కడ అవకతవకలు జరిగే అవకాశం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఆయా కళాశాలల్లో పరీక్షలకు ముందు ఇన్విజిలేటర్లకు డ్రా ద్వారా గదులు కేటాయిస్తారని అధికారులు పేర్కొంటున్నారు.
83 పోస్టులకు 37,984 మంది..పంచాయతీ కార్యదర్శి
Published Sat, Feb 22 2014 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM
Advertisement
Advertisement