ఏడుగంటలు..ఉత్తమాటలే!
- వ్యవసాయానికి నాలుగు గంటలు కూడా విద్యుత్ సరఫరా సక్రమంగా లేదు
- నీళ్లందక బోరు బావుల కింద పంటలు ఎండుతుండటంతో తల్లడిల్లుతోన్న రైతన్నలు
- మూడు వేల ఎకరాల్లో ఎండిపోయిన టమాటా పంట
- 42 వేల ఎకరాల్లో ఇతర పంటలదీ అదే దుస్థితి
కరెంట్ కోతలు ఇబ్బంది పెట్టింది ఒక్క మునెప్పనో.. ఒక్క వెంకటరెడ్డినో కాదు... 2,54,842 మంది రైతులను వేధిస్తున్నాయి. ఎన్నో కష్టాలకోర్చి వేలాది రూపాయలు వెచ్చించి సాగుచేసిన పంట కళ్ల ముందే ఎండిపోతుండడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి/తంబళ్లపల్లె/ కుప్పం: రైతులపై వరుణుడే కాదు ప్రభుత్వమూ పగబట్టింది. వర్షాధార పంటలు వర్షాభావంతో ఎండిపోతుంటే రైతుల కళ్లలో కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. బోరుబావుల కింద పంటలు సాగుచేసిన రైతులకూ కరెంట్ కోతలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చంద్రబాబుకే ఎరుక... కనీసం ఏడు గంటలైనా సక్రమంగా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే..
రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,54,842 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నా యి. బోరు బావుల కింద 6.5 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నట్లు అంచనా. బోరుబావుల కింద పశ్చిమ మండలాల్లో టమాటా, వంకాయ, బెండ, మిర్చి వంటి కాయగూర పంటలతోపాటు వేరుశెనగ పంటనూ విస్తారంగా సాగుచేశారు. ఒక్క టమాటానే ఆరు వేల ఎకరాలకు పైగా సాగుచేశారు. వర్షాభావంతో కాయగూరల దిగుబడి కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ నేపథ్యంలో అరకొర దిగుబడి వచ్చినా మంచి ధర దక్కితే గట్టెక్కవచ్చునని రైతులు ఆశించారు. కానీ.. రైతుల ఆశలపై డిస్కమ్ అధికారులు నీళ్లు చల్లారు.
నాలుగు గంటలే సరఫరా
వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. జిల్లాలో రోజుకు 12.5 మిలియన్ యూనిట్లను సరఫరా చేస్తుండగా.. వినియోగం 14 మిలియన్ యూనిట్లు ఉంది. సరఫరాకూ వినియోగానికి అంతరం పెరిగిపోతుండటంతో వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్‌లో కోతలు విధిస్తున్నారు. కేవలం నా లుగు గంటలు మాత్రమే వ్యవసాయానికి సరఫరా చేస్తున్నారు. విద్యుత్ సరఫరా తగినంత లేకపోతే నాలుగు గంటలు కూడా సరఫరా చేయలేకపోతున్నామని అనధికారికంగా డిస్కమ్ అధికారులు అంగీకరిస్తున్నారు.
తంబళ్లపల్లె మండలం యర్రమద్దువారిపల్లె లో వ్యవసాయానికి ఒకవారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు.. మరో వారం మ ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం ఆరు గం టల వరకు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దీంతో వర్షాభావంతో భూగర్భ జలా లు అడుగంటి బోర్లలో వచ్చే ఆరకొర నీరు కేవలం అర ఎకరా మాత్రమే పారుతుంది. దీంతో పంటలు సగం ఎండుతున్నాయి.
కుప్పం మండలం వెండుగంపల్లెలో వ్యవసాయానికి ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకూ.. రాత్రి 12 నుంచి రెండు గంటల వరకూ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. లోవోల్టేజీ కరెంట్ సరఫరా చేస్తుండటంతో మోటార్లు పనిచేయడం లేదు. దాంతో పొలానికి నీళ్లందక పంటలు ఎండిపోతున్నాయి.
పుంగనూరు మండలం పట్రపల్లెలోనూ అదే పరిస్థితి. వ్యవసాయానికి నాలుగు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయకపోవడంతో నీళ్లం దక వందలాది ఎకరాల్లో టమాటా, బెండ, వంకాయ తోటలు ఎండిపోయా యి.
లోవోల్టేజీ కరెంట్ సరఫరా చేస్తుండటంతో రైతులు వ్యవసాయ మోటార్ల వద్ద అర్ధరాత్రి పూట పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడు కరెంట్ వస్తే అప్పుడు స్విచ్చాన్ చేస్తేనే మో టారు పనిచేస్తుంది.. లేదంటే పనిచేయదు. ఇప్పటికైనా పంటలకు 7 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నారు.
కరంటు ఎప్పుడు వస్తుందో తెలీదు
ఎకరా పొలంలో టమోటా పంటను సాగు చేసా. రూ.40 వేలు ఖర్చు అయ్యింది. పంటను కంటికి రెప్పలా కాపాడుకుందామనుకుంటే కరంటు సక్రమంగా వుండదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎప్పుడు పోతుందో తెలియదు. టమాటాకు మంచి ధరలు పలికే సమయంలో నీళ్లు పారక పంట ఎండుముఖం పట్టింది. కరంటు సక్రమంగా ఇచ్చి వుంటే మా కష్టాలన్నీ తీరేవి. మహానుభావుడు రాజశేఖర్‌రెడ్డి హయాంలో కరంటు బాగా ఉండేది. వర్షాలు సకాలంలో కురిసి రైతులంతా సుభిక్షంగా ఉండేవాళ్లు.
-సాకల కోనప్ప, రైతు, పీటీఎం మండలం