43 మండలాల్లోనూ నష్టం
- నీలం, అల్పపీడనం ప్రభావిత ప్రాంతాల గుర్తింపు
- రెవెన్యూ గ్రామాల వారీ వివరాలకు ఉత్తర్వులు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో గతేడాది అక్టోబర్‌లో సంభవించిన పైలిన్ తుపాను, అల్పపీడనం, వరదలు కారణంగా నష్టపోయిన మండలాల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 43 మండలాల్లోనూ నష్టం జరిగి నట్లు గుర్తించి, ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది అక్టోబర్ 8వ తేదీ నుంచి 27వ తేదీ వరకు పైలిన్, అల్పపీడనం జిల్లాను వణికించాయి. పైలిన్ తుపాను ప్రభావం జిల్లాపై లేకపోయినప్పటికీ ఆ వెంటనే వచ్చిన అల్పపీడనం భారీ నష్టాన్ని మిగిల్చింది. అనేక మండలాలు ముంపునకు గురయ్యాయి.
వందల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఒకదానివెంట మరొకటిగా వచ్చిపడిన విపత్తులతో చోటుచేసుకున్న నష్టం అంచనాలలో కొంత జాప్యం జరిగింది. ఎలాగైతేనేం జిల్లాలో 34 మండలాల్లో 52,088 మంది రైతులకు చెందిన 13,290.97 హెక్టార్లలో నష్టం జరిగినట్టు అధికారులు నిర్ధారించారు. రూ.12.2 కోట్లు మేర ఇన్‌ఫుట్ సబ్సిడీ కోసం ప్రభుత్వానికి జిల్లా అధికారులు నివేదిక పంపారు. అలాగే అతివృష్టి కారణంగా కొన్ని చోట్ల రిజర్వాయర్లు, కాలువలు దెబ్బతిన్నాయి.
వాటర్‌ట్యాంకులు మరమ్మతులకు గురయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుం డా విశాఖ నగరంలో కూడా రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వ్యవసాయశాఖతో పాటు నీటి పారుదల, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్ అండ్ బీ, విద్యుత్, జీవీఎంసీ ఇలా అన్ని శాఖలకు సంబంధించి కూడా భారీగా నష్టం వాటిల్లింది. ఈ నష్టం నివేదికలను జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఈ నెల 6న ప్రభుత్వానికి పంపించారు. దానిని పరిశీలించిన ప్రభుత్వం 43 మండలాల్లోనూ నష్టం జరిగినట్లు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా మండలాల్లో రెవెన్యూ గ్రామాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.