- మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యేల పైరవీలు
- శిద్దా పట్ల సుముఖంగా ఉన్న చంద్రబాబు
- బాలినేనిపై గెలిచిన నా సంగతేంటంటున్న దామచర్ల
- ఆశావహుల్లో కదిరి, డోలా, ఏలూరి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ఐదుగురు మంత్రి పదవుల కోసం పైరవీలు చేస్తున్నారు. అమాత్య పదవి తనకంటే తనకు ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. కొందరు అధినేతతో అంతర్యుద్ధానికి కూడా దిగినట్లు సమాచారం. 2004, 2009 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ నుంచి ఒక్కో శాసన సభ్యుడు మాత్రమే గెలిచారు. 2004లో అద్దంకి నుంచి కరణం బలరామకృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహించగా 2009లో మార్కాపురం నుంచి కందుల నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పదేళ్ల తర్వాత తొలిసారిగా ఆ పార్టీ తరఫున జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఆ ప్రాతిపదికన జిల్లాకు మంత్రి పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు.
- దర్శి నుంచి గెలుపొందిన శిద్దా రాఘవరావుకు మాత్రమే మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే విషయం బలంగా వినిపిస్తుండటంతో మిగిలిన శాసనసభ్యులు తమకు కూడా మంత్రి పదవులు కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
- శిద్దా రాఘవరావుకు మంత్రి పదవి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏమిటని అధిష్టానాన్ని పరోక్షంగా ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఆయన 2004లో పరాజయం పొందాడని, ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో ఆ తర్వాత ఎమ్మెల్సీని కట్టబెట్టారని చెబుతున్నారు. ఈసారి కూడా ఆయన కేవలం 1200 ఓట్ల మెజారిటీతోనే గెలిచారని గుర్తు చేస్తున్నారు.
- జిల్లాలో రాజకీయ దిగ్గజం వంటి బాలినేని శ్రీనివాసరెడ్డిపై మంచి మెజారిటీతో గెలిచిన తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వరని దామచర్ల జనార్దన్ ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. టీడీపీ జిల్లా అధ్యక్షునిగా ఉన్న దామచర్ల నాయకత్వంలోనే పదేళ్ల తర్వాత ఐదు స్థానాలను కైవసం చేసుకున్నారు. తొలి ప్రాధాన్యం తనకు ఇవ్వకుండా శిద్దాకు ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు.
- దామచర్ల కూడా మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తన సతీమణి బంధువు బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు ద్వారా జనార్దన్ పైరవీ చేస్తున్నట్లు సమాచారం.
- 2004లో పోటీ చేసి ఓడిపోయిన కదిరి బాబురావు కూడా శిద్దాకు మంత్రి పదవి కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. సినీ నటుడు బాలకృష్ణకు సన్నిహితుడైన కదిరి, ఆయన ద్వారా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
- పర్చూరు నుంచి గెలుపొందిన ఏలూరి సాంబశివరావు కూడా నారా లోకేష్ ద్వారా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
- ఎస్సీ కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని కొండపి శాసనసభ్యుడు డోలా బాల వీరాంజనేయస్వామి డిమాండ్ చేస్తున్నారు.
- ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా శిద్దా రాఘవరావుకు మాత్రమే పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు దేవాదాయ లేదా వాణిజ్య పన్నుల శాఖ అప్పగించేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
- ఈ నేపథ్యంలో ఆర్థిక బలం ఉన్న ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు కట్టబెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘దేశం’లో అంతర్యుద్ధం
Published Fri, May 23 2014 4:09 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM
Advertisement