మాచర్ల టౌన్, న్యూస్‌లైన్ :రెంటచింతల మండలం జెట్టిపాలెం గ్రామ శివారులో శనివారం తెల్లవారుజామున ఎక్సయిజ్ అధికారులు దాడులు నిర్వహించి 500 లీటర్ల సారాను పట్టుకున్నారు. 500 లీటర్ల సారా ఉన్న 25 క్యాన్లను ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నట్లు జిల్లా ఎక్సయిజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు తెలిపారు. ఆటో, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులను అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారయ్యారు. ఇందుకు కారకులైన జెట్టిపాలెంకు చెందిన కామనబోయిన లచ్చయ్య, జఠావత్ మునినాయక్, రాపాటి కొండలు, దేవళ్ల గురయ్యలను అదుపులోకి తీసుకుని విచారించారు. నల్లగొండ జిల్లా నుంచి రెంటచింతలకు సారా తీసుకువెళుతున్నట్లు విచారణలో తేలింది. పరారైన వారి కోసం ఎక్సయిజ్ అధికారులు పోలీసు సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. కేసులను నమోదు చేసి ద్విచక్ర వాహనం, ఆటోను సీజ్ చేసి నలుగురు నిందితులను కోర్టులో హాజరుపర్చినట్లు ఎక్సయిజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు చెప్పారు. దాడుల్లో ఎక్సయిజ్ సీఐలు దేవర శ్రీనివాసరావు, మధుబాబు ఉన్నారు.
ఇంట్లో మద్యం సీసాల నిల్వ..
చెరుకుపల్లి:సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు మండలంలోని బలుసులపాలెం పంచాయతీ పరిధిలోని మెట్టగౌడవారిపాలేనికి చెందిన కాటూరి సుబ్బారావు మద్యం బాటిళ్లను నిల్వ ఉంచినట్లు ఎస్‌ఐ పి.కిరణ్ చెప్పారు. శనివారం తెల్లవారుజామున ఆకస్మిక దాడిచేసి అతని ఇంట్లో ఉన్న 205 క్వార్టర్ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సుబ్బారావును అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరుస్తామన్నారు.
105 మద్యం సీసాలు స్వాధీనం
పిడుగురాళ్ళ: మండలంలోని గుత్తికొండ సాగర్ కాలువ వద్ద అక్రమంగా మద్యం సీసాలు కలిగి ఉన్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎక్సయిజ్ సీఐ పి.నాగేశ్వరరావు శనివారం తెలిపారు. వీరి వద్ద 105 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు గుత్తికొండ గ్రామంలో తనిఖీలకు వెళ్తుండగా గ్రామ సమీపంలోని సాగర్ కాల్వవద్ద అనుమానాస్పదంగా షేక్ యూసోబు, అన్నపురెడ్డి రామిరెడ్డి అనే వ్యక్తులు తచ్చాడుతన్నారని సీఐ తెలిపారు. విచారించి వారి వద్ద 93 మద్యం సీసాలతోపాటు 12 బీరు సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏసీ ఆదిశేషు, ఎస్‌ఐ రేఖారెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఖాజీపేట గోడౌన్‌లో మద్యం సీసాలు స్వాధీనం..
తెనాలి టౌన్: సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఖాజీపేట గ్రామంలోని గోడౌన్‌లో నిల్వ ఉంచిన మద్యం సీసాలను విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, ఎక్సయిజ్ అధికారులు శనివారం దాడి చేసి పట్టుకున్నారు. ఎక్సయిజ్ ఏసీ ఆదిశేషు తెలిపిన వివరాల ప్రకారం.. రూరల్ మండలం కొలకలూరు గ్రామ శివారు ఖాజీపేటలోని చిట్టిమడుగుల వెంకటస్వామి చెందిన గోడౌన్‌లో మద్యం నిల్వలు ఉన్నట్లు సమాచారం వచ్చింది. ఆ మేరకు గోడౌన్‌పై అధికారులు దాడులు నిర్వహించగా 480 ఓటి క్వార్టర్ సీసాలు లభ్యమయ్యాయి. మద్యం సీసాలను స్వాధీన పరచుకుని, తెనాలి ఎక్సయిజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించి, గోడౌన్‌ను సీజ్ చేసినట్లు ఆదిశేషు తెలిపారు. నిందితులను అరెస్టు చేశామన్నారు. దాడుల్లో ఎక్సయిజ్ సీఐ జి.వీరాంజనేయులు, రూరల్ ఎస్‌ఐ వెంకట్రావు, ఎక్సయిజ్, సివిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
500 లీటర్ల సారా పట్టివేత
Published Sun, May 4 2014 12:43 AM | Last Updated on Fri, Aug 17 2018 7:48 PM
Advertisement
Advertisement