రాష్ట్రంలో స్వల్ప భూకంపం
భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్‌పై 6గా పేర్కొన్న అధికారులు
సాక్షి నెట్‌వర్క్: బంగాళాఖాతంలో బుధవారం రాత్రి సంభవించిన స్వల్ప భూకంప ప్రభావం రాష్ట్రంలోని పలు ప్రాంతాలపై పడింది. విశాఖ నగరంలో, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం రాత్రి భూమి కొద్ది సెకెన్ల పాటు తీవ్రంగా కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బుధవారం సుమారు పది సెకెన్ల పాటు తీవ్ర శబ్దంతో భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లు, అపార్టమెంట్లలోంచి బయటకు పరుగులు తీశారు. కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ భూమి స్వల్పంగా కంపించింది.
కృష్ణా జిల్లాలోని విజయవాడ, పరిసర ప్రాంతాల్లో.. విజయనగరం జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, ఎస్.కోట, నెల్లిమర్ల, గజపతినగరం ప్రాంతాల్లో.. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం పట్టణంతోపాటు జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో భూకంప ప్రభావం కనిపించింది. తిరుపతి, రాజమండ్రిల్లోనూ భూమి కంపించింది. భూకంప తీవ్రతకు పలు ఇళ్లలో సామగ్రి కిందపడిపోయింది. అక్కడక్కడా ఇళ్ల గోడలు బీటలు వారాయి. భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్లలోంచి బయటకు వచ్చి చాలాసేపు రోడ్డుపైనే గడిపారు. భారతీయ వాతావరణ శాఖ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్‌పై 6 గా పేర్కొంది.
దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ..
న్యూఢిల్లీ/తైపీ: బుధవారం రాత్రి సంభవించిన ఓ మోస్తరు భూకంపం దేశంలోని పలు ప్రాంతాల్లోని ప్రజలను భయాందోళలకు గురిచేసింది. రాత్రి 9 గంటల 52 నిమిషాలకు బంగాళాఖాతంలో పారాదీప్‌కు తూర్పున 60 కి. మీల దూరంలో 10 కి.మీల అడుగున భూకంపం సంభవించిందని భారత వాతావరణ విభాగం డెరైక్టర్ జనరల్ ఎల్‌ఎస్ రాథోడ్ వెల్లడించారు. ఢిల్లీ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో భూకంప ప్రభావం కనిపించింది. చెన్నై, భువనేశ్వర్, కటక్‌ల్లో భవనాలు కంపించాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. తైవాన్‌ను కూడా బుధవారం రాత్రి భూకంపం కుదిపేసింది. భూకంపం ప్రభావంతో తైవాన్ రాజధాని తైపీలో భవనాలు ఒక్కసారిగా కంపించాయి.