భూ యజమానుల గుండెల్లో..మెట్రో రైళ్లు | 60 acres land for metro rail in vijayawada | Sakshi
Sakshi News home page

భూ యజమానుల గుండెల్లో..మెట్రో రైళ్లు

Published Wed, Apr 8 2015 4:33 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

భూ యజమానుల గుండెల్లో..మెట్రో రైళ్లు - Sakshi

భూ యజమానుల గుండెల్లో..మెట్రో రైళ్లు

మెట్రో రైలు కావాలంటే 60 ఎకరాలు తప్పనిసరి
ఆందోళనలో బందరురోడ్డు,  ఏలూరురోడ్ల వాసులు
ఏడేళ్లుగా సాగుతున్నగన్నవరం ఎయిర్‌పోర్టు భూసేకరణ
బందరు-విజయవాడ రహదారి విస్తరణకూ ఇదే సమస్య
తాజాగా తెరపైకి మెట్రో భూసేకరణ వ్యవహారం

 
సాక్షి, విజయవాడ బ్యూరో :  మెట్రో రైలు ప్రాజెక్టు కోసం నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో భూసేకరణ చేయనున్నారనే సమాచారం స్థానికుల్లో గుబులు రేపుతోంది. భూసేకరణ వ్యవహారంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోయినా డీఎంఆర్‌సీ (ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్) నియమించిన కన్సల్టెన్సీలు ఇప్పటికే సర్వేలు పూర్తిచేయడంతో ఏదో జరుగుతోందని స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. డీఎంఆర్‌సీ త్వరలో ప్రభుత్వానికి సమర్పించనున్న విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు సవివర నివేదికలో భూసేకరణ కీలకాంశంగా ఉంది. ప్రాజెక్టు కోసం సుమారు 60 ఎకరాల భూమిని సేకరించాలని అందులో పొందుపరిచారు.

45 నుంచి 50 ఎకరాలను కోచ్ డిపో కోసం నిడమానూరులో సేకరించాలని పేర్కొన్నారు. జాతీయ రహదారి పక్కన బెస్ట్‌ప్రైస్ షోరూమ్ వెనుక ఈ భూమిని సేకరించడం ఖాయంగా కనిపిస్తోంది. బందరు రోడ్డు కారిడార్‌లో నిర్మించనున్న స్టేషన్ల కోసం రోడ్డుకిరువైపులా (పలుచోట్ల) సుమారు 4.5 ఎకరాలు (8 వేల చదరపు మీటర్లు) స్థలం తీసుకోనున్నారు. ఏలూరు రోడ్డు కారిడార్‌లో బస్టాండ్ నుంచి రామవరప్పాడు మీదుగా నిడమానూరు వరకూ రోడ్డుకిరువైపులా సుమారు 5 ఎకరాల (9 వేల చదరపు మీటర్లు) స్థలం సేకరించనున్నారు.

భూసేకరణకు సంబంధించి తమ భూముల్లో డీఎం ఆర్‌సీ సర్వేలు చేస్తుండడంతో ఆందోళన చెందిన స్థానికులు సీఆర్‌డీఏ కార్యాలయానికి వచ్చి ప్రశ్నిస్తున్నారు. డీపీఆర్ ఇంకా ప్రభుత్వానికి సమర్పించకపోవడంతో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా దీనిపై డీఎంఆర్‌సీని సంప్రదిస్తున్నారు. గజం లక్ష నుంచి రెండున్నర లక్షలు విలువ చేసే నగర ప్రాంతం, శివారలో ఎకరం రూ.2 కోట్లకుపైనే పలికే  అత్యంత ఖరీదైన ప్రాంతంలో జరగనున్న భూసేకరణ కావడంతో అంతటా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఇదే ప్రాంతంలో రెండు భూసేకరణలు ఏళ్ల తరబడి వివాదాలుగా మారి నలుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో మెట్రో కోసం భూసేకరణ ఏమేర ముందుకెళుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ-మచిలీపట్నం రహదారిని నాలుగులైన్లుగా విస్తరించడం కోసం చేపట్టిన భూసేకరణ వ్యవహారం ఆరేళ్లుగా సాగుతోంది. బెంజిసర్కిల్ నుంచి మచిలీపట్నం వరకూ రోడ్డును వెడల్పు చేసే క్రమంలో పలుచోట్ల భవనాలు తొల గించాల్సిరాగా, కొన్నిచోట్ల స్థలాలు తీసుకోవాల్సివచ్చింది. దీనిపై అనేక అభ్యంతరాలు రాగా చాలావరకూ పరిష్కరించారు. కానూరు, పోరంకి, గండిగుంట ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించలేకపోయా రు. వీటివల్లే బందరు రోడ్డు విస్తరణ ప్రాజెక్టు ఆరేళ్లుగా నిలిచిపోయింది.

గన్నవరం ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చేందుకు అవసరమైన 490 ఎకరాలను సేకరించేందుకు ఏడేళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా కొలిక్కిరాలేదు. తాజాగా 490 ఎకరాలకు తోడు 220 ఎకరాలను తీసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నా స్థానికులు ఒప్పుకోవడంలేదు. కీలకమైన రెండు ప్రాజెక్టులకు ఏడేళ్ల నుంచి భూమి సమకూరని పరిస్థితుల్లో మెట్రో భూసేకరణ ఎన్ని సంవత్సరాలకు పూర్తవుతుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement