ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
మంగళగిరి: రాజధాని రోడ్ల నిర్మాణానికి భూసేకరణ చేస్తామని రైతులను బెదిరిస్తే ఉద్యమం తప్పదని గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన సాక్షితో ఫోన్లో మాట్లాడుతూ ప్రభుత్వం భూసేకరణ చేస్తామని ప్రకటించడంపై మండిపడ్డారు. కోర్టు రైతులను వ్యవసాయం చేసుకోనివ్వాలని స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, అలాంటి కోర్టు తీర్పునే ధిక్కరిస్తారా అని ప్రశ్నించారు. రాజధానికి రోడ్డు కావాలనుకుంటే గతంలో కృష్ణానదిపై వంతెనతోపాటు సూరాయపాలెం నుంచి వెంకటపాలెం వరకు భూసేకరణ చేసి అన్ని అనుమతులు పొందిన రోడ్డు నిర్మాణంతోపాటు, కనకదుర్గ వారధి నుంచి విస్తరించుకుంటే సరిపోతుందన్నారు. రోడ్డు నిర్మాణం పేరుతో నిర్వాసితులు, రైతులపై బెదిరింపులకు దిగితే వారితో కలిసి ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. కోర్టులు మొట్టికాయలు వేసినా, మళ్లీ భూసేకరణ ప్రకటనలతో రైతులను ఆందోళన గురి చేయడం తగదన్నారు.
రాజధాని నిర్మాణం రాష్ట్ర ప్రజల కోసం కాదని చంద్రబాబు, తన అనుచరుల రియల్ వ్యాపారం కోసమేనని ఇప్పటికే ప్రపంచమంతా అర్థమైందని గ్రహించాలన్నారు. రాజధాని నిర్మాణానికి తాను కాని, తమ పార్టీ కాని ఏనాడు వ్యతిరేకం కాదని ఆ పేరుతో రైతులు, రైతుకూలీలు, నిర్వాసితులకు అన్యాయం చేస్తామంటే చూస్తూ ఊరుకుంటామని అనుకోవద్దని ఆర్కే పేర్కొన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు బెదిరింపులు, కక్షపూరిత వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. ఇప్పటికైనా, ప్రజలు తిరగబడకముందే ప్రజాసమస్యలపై దృష్టి సారించాలని సూచించారు.