సాక్షి ప్రతినిధి, తిరుపతి: నోటితో పలకరించి నొసటితో వెక్కిరించడమంటే ఇదే..! వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 66 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి.. ఆదుకోవాలని కలెక్టర్ నివేదిక పంపారు. ఆ నివేదిక మేరకు జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు బుధవారం హామీ ఇచ్చారు.
కానీ గతేడాది నష్టపోయిన రైతులకు ఇప్పటికీ ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా పరిహారం కానీ విడుదల చేయకపోవడం గమనార్హం. కరువు జిల్లాగా ప్రకటించి చేతులు దులుపుకుంటే ఏం ప్ర యోజనమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షచాయ(రెయిన్ షాడో) ప్రాంతమైన జిల్లాలో గత నాలుగేళ్లుగా దుర్భిక్షం నెలకొంది. వరుసగా ఐదో ఏట కూడా వర్షాభావం కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాల వల్ల ఖరీఫ్‌లో 439.4 మిమీల వర్షపాతం కురవాల్సి ఉండగా.. కేవలం 271.4 మిమీలవర్షమే కురిసింది.
వర్షపాత వివరాలు ఎ క్కువగా ఉండడంతో 1.39 లక్షల హెక్టార్లలో సాగుచేసిన వేరుశెనగ పంట ఎండిపోయింది. హెక్టారుకు సగటున 48 కిలోల దిగుబడి కూడా రైతులకు దక్కలేదన్నది పంట కోత ప్రయోగాల్లో వెల్లడైంది. రబీలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఈశాన్య రుతుపవనాల వల్ల 395.4 మిమీల వర్షం కురువాల్సి ఉండగా.. ఇప్పటిదాకా కేవలం 68.2 మిమీల వర్షం పడింది. రబీలో 59,970 హెక్టార్లలో వరి, వేరుశెనగ తదితర పంటలను సాగుచేయాల్సి ఉండగా.. కేవలం 5,188 హెక్టార్లలో మాత్రమే రైతులు పంటలు సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భజలాలు అడుగంటిపోవడంతో నీటి ఎద్దడి అప్పుడే వేసవిని తలపిస్తోంది.
జిల్లాలో ఇప్పటికే 1723 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి పూర్తిగా ఏర్పడింది. వర్షపాతం, పంట దిగబడులు, తాగునీటి ఎద్దడి, పశుగ్రాసం తదితర అంశాల ఆధారంగా జిల్లాలో 66 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించాలని వారం క్రితం కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. బుధవారం కురుబలకోట మం డలం అంగళ్లులో ‘జన్మభూమి- మా ఊరు’లో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. కానీ.. దుర్భిక్షం నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంపై స్పష్టత ఇవ్వలేదు.
గతేడాదికే దిక్కులేదు..
గతేడాది జిల్లాలో వర్షాభావం రాజ్యమేలింది. జిల్లాలో 36 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. వర్షాభావం నేపథ్యంలో 1.54 లక్షల హెక్టార్లలో పంట నష్టపోయిన రైతులకు రూ.108 కోట్ల మేర ఇన్‌పుట్ సబ్సిడీని చెల్లించాలని అధికారులు అప్పట్లో ప్రభుత్వానికి నివేదిక పంపారు. 1.12 లక్షల హెక్టార్లలో వేరుశెనగ పంట నష్టపోయిన రైతులకు వాతావరణ బీమా కింద రూ.101 కోట్ల పరిహారం మంజూరు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ.. ఇన్‌పుట్ సబ్సిడీగానీ వాతావరణ బీమా పరిహారాన్నిగానీ ప్రభుత్వం ఇప్పటిదాకా విడుదల చేయలేదు.
ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా పరిహారాన్ని కెలామిటీ రిలీఫ్ ఫండ్(సీఆర్‌ఎఫ్) నిధులతో రైతులకు ప్రభుత్వం చెల్లిస్తుంది. సీఆర్‌ఎఫ్‌కు 75 శాతం నిధులను కేంద్రం సమకూర్చితే.. 25 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలి. గతేడాది నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా పరిహారాన్ని చెల్లించడానికి వీలుగా కేంద్రం ఇప్పటికే తన వాటా నిధులను విడుదల చేసింది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా నిధుల ను విడుదల చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వ వైఖ రివల్లే పంట నష్టపోయి ఏడాది పూర్తవుతు న్నా నేటికీ రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా పరిహారం అందకపోవడం గమనార్హం.
మాటలతో ప్రయోజనమేంటి..?
జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటిస్తే.. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించాలి. వాతావరణ బీమా ప్రీమియం చెల్లించిన రైతులకు పరిహారం మంజూరు చేయాలి. పంట రుణాలను ప్రభుత్వం రీషెడ్యూలు చేసి.. కొత్త పంట రుణాలను ఇప్పిస్తుంది. తాగునీటి ఎద్దడికి అవసరమైన నిధులు.. పశుగ్రాసం కొరతను నివారించడానికి చర్యలు చేపడుతుంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీగా చెల్లించడానికి రూ.154 కోట్లు మంజూరు చేయాలని వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు పంపారు.
వేసవిలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి కనీసం రూ.45 కోట్లు అవసరం అవుతాయని గ్రామీణ నీటి సరఫరా అధికారులు అంచనా వేస్తున్నారు. పశుగ్రాసం కొరత నివారించడానికి కనిష్ఠంగా రూ.12 కోట్ల మేర అవసరం అవుతాయని పశుసంవర్థకశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించి.. ఈ ఏడాది కొత్తగా పంట రుణాలను బ్యాంకర్లు మంజూరు చేయకపోవడం వల్ల రీషెడ్యూలు చేసే పరిస్థితి ఉండదు. బీమా ప్రీమియం రైతులు చెల్లించని నేపథ్యంలో పరిహారం మంజూరు చేసే పరిస్థితి కూడా ఉండదు. అంటే.. రైతులకు కేవలం ఒక్క ఇన్‌పుట్ సబ్సిడీని మాత్రమే అందించేందుకు అవకాశం ఉంటుంది. గతేడాది ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా పరిహారాన్నే ఇప్పటికీ మంజూరు చేయని నేపథ్యంలో.. ఈ ఏడాది నష్టపోయిన రైతులకు ఎప్పుడు ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేస్తారన్నది అంతుచిక్కడం లేదు.
ఊరట ఏదీ..?
Published Fri, Nov 7 2014 3:41 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement