ఆరిన ‘దీపం’
పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు సర్కారు మరో షాకిచ్చింది. ఇప్పటికే డ్వాక్రా రుణాల మాఫీ హామీని అటకెక్కించి, స్త్రీ నిధి రుణాలపై వడ్డీ పెంచి వారిపై పెనుభారాన్ని మోపిన బాబు..తాజాగా మంజూరైన దీపం గ్యాస్ కనెక్షన్లు రద్దు చేయడం పేదవారి వంటింట్లో అలజడి రేపుతోంది.
సాక్షి, ఒంగోలు: మేలు చేస్తుందనే ఆశతో ఓటేసి అధికారంలోకి తెచ్చిన టీడీపీ.. మిహిళలకు షాకుల మీద షాకులిస్తోంది. బ్యాంకు రుణాలు చెల్లించొద్దంటూ నమ్మబలికి రుణాల మాఫీ చేయని టీడీపీ సర్కారుపై డ్వాక్రా మహిళలు ఇప్పటికే దుమ్మెత్తిపోస్తున్నారు. బిడ్డల చదువులకు అక్కరకొస్తాయని దాచుకున్న పొదుపు సొమ్మునూ.. బ్యాంకర్లు రికవరీ పేరుతో జమ చేసుకోవడంతో బాధితుల కడుపు రగిలిపోతోంది. పుండు మీద కారం చల్లినట్లు ‘దీపం’ గ్యాస్ కనెక్షన్ల రద్దు వ్యవహారంతో వారిలో ఆగ్రహం పెళ్లుబుకుతోంది. అటు రైతులను, ఇటు మహిళలనూ పనిగట్టుకుని చంద్రబాబు సర్కారు ఇబ్బందులకు గురిచేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లాలో 7,874 దీపం గ్యాస్ కనెక్షన్‌లు రద్దయ్యాయి. జిల్లాకు ప్రభుత్వం 2012-13 ఆర్థిక సంవత్సరంలో రెండు విడతలుగా మొత్తం 28,494 గ్యాస్ కనెక్షన్‌లను మంజూరు చేసింది. అయితే, వాటిని అధికారులు సకాలంలో అర్హులకు అందజేయలేకపోయారు. మండల పరిషత్ అధికారులు గ్రామసభలు నిర్వహించి అర్హతలను బట్టి లబ్ధిదారుల ఎంపిక చేయాల్సి ఉండగా, అప్పట్లో వారు నిర్లక్ష్యం ప్రదర్శించారు. మంజూరైన కనెక్షన్‌లకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికీ పూర్తి చేయలేదు. వాస్తవానికి, వాటి ల్లో ఇప్పటికి 7,135 కనెక్షన్‌లు గ్రౌండింగ్ చేయాల్సి ఉంది.
మిగిలిన వాటినైనా లబ్ధిదారులకు అందించారా..? అంటే అదీ జరగలేదు. సగం కనెక్షన్‌లు మాత్రమే గ్రౌండింగ్ పూర్తయి లబ్ధిదారుల చేతికి సిలిండర్‌లు అందాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ఆ గ్యాస్ కనెక్షన్‌లన్నీ రద్దయ్యాయి. మరలా అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తులు పెట్టుకోవడం... అధికారులు విచారణ చేసి అర్హతలను ధ్రువీకరించడం.. ఆ తర్వాత కొత్తప్రభుత్వం దీపం కనెక్షన్‌లు మంజూరు చేస్తుందో.. లేదో చూడాల్సి ఉంది. ఇక, 2013-14 ఆర్థిక సంవత్సరంలో 10,300 కనెక్షన్‌లను ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేయగా, వాటిల్లో ఇంకా 735 గ్రౌండింగ్ చేయాల్సి ఉన్నట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు.
గుర్తింపునకు తాపత్రయం:
‘దీపం’ పథకం 1999 నుంచి రాష్ట్రంలో అమలవుతోంది. అప్పటి నుంచి ఏటా వేలాది కనెక్షన్లు ఈ పథకం కింద జిల్లాకు మంజూరవుతున్నాయి. అయితే, రాజకీయ నాయకుల జోక్యం.. అధికారుల నిర్లక్ష్యం కలిసి ఎంపికకు తూట్లు పొడుస్తున్నాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో లబ్ధిదారులను ఎంపిక చేయకుండా నిర్లక్ష్యం వహించడం ఒక కారణమైతే.. అధికారులు పంపిన జాబి తాల్లో అనర్హుల పేర్లు చోటుచేసుకోవడం అర్హులకు శాపమవుతోంది.
అయితే, పాత జాబితాలను రద్దు చేసి.త. మరలా కొత్తగా అర్హులను గుర్తించి ప్రతిపాదనలు పంపితే మంజూరు చేస్తామనడంపై డ్వాక్రా మహిళలు విస్తుపోతున్నారు. కేవలం, అధికార టీడీపీ గుర్తింపు కోసం ప్రయత్నిస్తోందని.. గ్రామీణ మహిళల ఇబ్బందులు ఆలకించినట్లైతే మంజూరైన కనెక్షన్‌లను రద్దు చేయదంటున్నారు.