7,8 తేదీల్లో ఓదార్పు యాత్ర
మాచర్ల టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో ‘ఓదార్పు యాత్ర’ తిరిగి ప్రారంభం కానుందని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామ కృష్ణారెడ్డి బుధవారం తెలిపారు. మార్చి 7,8 తేదీల్లో పల్నాడు ప్రాంతంలో యాత్ర జరుగుతు ందన్నారు. మహానేత డాక్టరు వైఎస్ రాజశేఖరరెడ్డి మృతిని తట్టుకోలేక గుండె చెదిరి మరణించిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. మార్చి ఏడవ తేదీన జిల్లాలో ఓదార్పు యాత్ర పునఃప్రారంభమవుతోందని ఎమ్మెల్యే చెప్పారు. రెండు రోజులపాటు సాగే యాత్ర వివరాలను ఆయన విలేకరులకు వివరించారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్‌మోహన్‌రెడ్డి మార్చి ఆరవ తేదీన జిల్లాకు వస్తున్నట్టు తెలిపారు.
ఆ రోజు నరసరావు పేటలో భారీ బహిరంగ సభ నిర్వహణ అనంతరం ఏడవ తేదీ ఉదయం మాచర్ల నియోజకవర్గం కారంపూడి నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభిస్తారన్నారు. గాదెవారిపల్లె, దుర్గి మండలం కంచరగుంట గ్రామాల మీదుగా యాత్ర సాగుతుందన్నారు. అనంతరం యాత్ర మాచర్ల చేరుకొంటుందని, అక్కడ ఏర్పాటు చేసే బహిరంగసభలో జగన్ ప్రసంగించి రాత్రికి అక్కడే బస చేస్తారన్నారు. ఎనిమిదిన మాచర్ల, వెల్దుర్తి మండలాల్లోని వివిధ గ్రామాల్లో యాత్ర జరుగుతుందన్నారు. రెండు రోజుల పాటు సాగే యాత్రను విజయవంతం చేసేందుకు వైఎస్సార్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.