ఎన్నాళ్లీ అక్రమ నిర్బంధం? | 7 Maoists on indefinite hunger strike in Odisha jail for speedy trial | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ అక్రమ నిర్బంధం?

Published Wed, Mar 25 2015 4:12 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

ఎన్నాళ్లీ అక్రమ  నిర్బంధం? - Sakshi

ఎన్నాళ్లీ అక్రమ నిర్బంధం?

మందస:  ‘జనజీవన స్రవంతి కలసిపోవాలన్న ఉద్దేశంతో ఆంధ్ర పోలీసు ఉన్నతాధికారుల ముందు లొంగిపోయిన నా కుమారునిపై కేసులు ఉన్నాయంటూ ఒడిశా పోలీసులు తీసుకుపోయారు. ఏళ్ల తరబడి జైలులో నిర్బంధించడంతో మానసికంగా, శారీరకంగా కుంగిపోయాడు. విధి లేక ఈ నెల 23 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. పరామర్శకు వెళ్లిన తనకు ఈ విషయం తెలియజేస్తూ కొన్ని డిమాండ్లతో కూడిన లేఖను నాకు అందజేశాడు. నిరాహార దీక్ష చేస్తే నా కుమారుడి ప్రాణానికి ముప్పు వాటిల్లుతుంది. అందువల్ల ఆంధ్ర, ఒడిశా పోలీసులు కరుణించి నా కుమారుడి విడుదలకు  సత్వర చర్యలు చేపట్టాలి’.. ఇదీ మాజీ మావోయిస్టు దున్న కేశవరావు అలియాస్ ఆజాద్ తల్లి కాములమ్మ కన్నీటి నివేదన. తన కుమారుడు ఇచ్చిన లేఖను మంగళవారం తన స్వగ్రామం నల్లబొడ్డులూరులో విలేకరులకు ఆమె అందజేశారు.
 
 లొంగిపోయినా నిర్బంధంలోనే..
 ఈ సందర్భంగా ఆమె అందజేసిన వివరాల ప్రకారం.. చిన్నతనంలోనే ఇంటి నుంచి వెళ్లిపోయిన కేశవరావు మావోయిస్టు ఉద్యమంలో చేరి అజ్ఞాత జీవితం గడిపాడు. రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు 2011 మే 18న అప్పటి పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ద్వారా డీజీపీ అరవిందరావు సమక్షంలో పోలీసులకు లొంగిపోయారు. స్వగ్రామానికి వచ్చిన మూడు రోజులకే పోలీసులు వచ్చి పలాస డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న ఒడిశా పోలీసులు విచారణ జరిపి పంపేస్తామని చెప్పి తీసుకెళ్లారు. పలు కేసుల పెండింగులో ఉన్నాయంటూ భువనేశ్వర్‌లోని జార్పడ్ జైలులో నిర్బంధించారు. లొంగిపోయిన మాజీ మావోయిస్టును మూడున్నరేళ్లకుపైగా జైలులో ఉంచడం, దఫదఫాలుగా కేసులు బనాయిస్తూ వేధింపులకు గురి చేయడానికి నిరసనగా గతంలోనూ ఆజాద్ జైలులోనే నిరాహార దీక్ష చేపట్టాడు. తన కుమారుడిని విడుదల చేయాలని కాములమ్మ పలుమార్లు ఆంధ్ర, ఒడిశా ప్రభుత్వాలను కోరినప్పటికీ స్పందన లేదు. దీంతో విసిగిపోయిన ఆజాద్ తనను కారుణ్య మరణానికి(మెర్సీ కిల్లింగ్) అనుమతించాలని కోరుతూ కేంద్ర హోంశాఖతోపాటు ఆంధ్ర, ఒడిశా ప్రభుత్వాలకు, మానవ హక్కుల కమిషన్, హైకోర్టు, పలు ప్రజా సంఘాలకు లేఖ రాశాడు.
 
 లేఖలో నాలుగు డిమాండ్లు
 కాగా ఇటీవల కుమారుడిని చూసేందుకు జార్పడ్ జైలుకు వెళ్లిన తల్లి కాములమ్మకు అధికారులను ఉద్దేశించి రాసిన నాలుగు డిమాండ్లతో కూడిన లేఖను ఆజాద్ అందజేశాడు. కోర్టుల్లో ఉన్న కేసుల  విచారణ ప్రక్రియ వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, ఏళ్ల తరబడి జైలులో ఉన్న సమయంలోనే కొత్త కేసులు కట్టడం, బెయిల్‌పై విడుదలైన తరువాత జైలు గేటు వద్దే అరెస్టు చేసి మళ్లీ కేసులు పెట్టడం మానుకోవాలని డిమాండ్ చేశాడు. అరెస్టు అయిన వ్యక్తిపై ఇతర అభియోగాలు ఉంటే నిర్ధిష్ట సమయంలో కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరచాలని, మావోయిస్టు పేరుతో అరెస్టై జైలు జీవితం గడుపుతున్న వారందరినీ రాజకీయ ఖైదీలుగా గుర్తించాలని డిమాండ్ చేశాడు. న్యాయమైన ఈ డిమాండ్లను తీర్చే వరకు ఈ నెల 23 నుంచి ఆమరణ దీక్ష చేస్తానని తెలిపారు. తన కుమారుడితో పాటు ఇటువంటి వేధింపులే అనుభవిస్తున్న మరో ఏడుగురు కూడా జైల్‌లో దీక్షకు పూనుకున్నారని కాములమ్మ చెప్పారు.
 
 కాములమ్మ ఇంటికి పోలీసులు
 ఈ నేపథ్యంలో నల్లబొడ్డులూరులోని కేశవరావు ఇంటికి మంగళవారం సోంపేట సీఐ సూరినాయుడు, మందస ఎస్సై వి.రవివర్మ వెళ్లారు. ఆయన తల్లి కాములమ్మతో మాట్లాడారు. కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారని అనంతరం కాములమ్మ చెప్పారు. ఈ విషయం సీఐ వద్ద ప్రస్తావించగా మాజీ, ప్రస్తుత మావోయిస్టుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరమార్శించడం సాధారణమేనని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement