తుపాను మిగిల్చిన వేదన తనువు చాలించిన మహిళ | 74 thousand acres of cashew nuts gardens was collapsed at Uddanam | Sakshi
Sakshi News home page

తుపాను మిగిల్చిన వేదన తనువు చాలించిన మహిళ

Published Sat, Oct 20 2018 4:13 AM | Last Updated on Sat, Oct 20 2018 4:13 AM

74 thousand acres of cashew nuts gardens was collapsed at Uddanam - Sakshi

తిత్లీ తుపాను ధాటికి నాశనమైన మృతురాలి జీడితోట. (ఇన్‌సెట్‌లో) నారాయణమ్మ(ఫైల్‌)

వజ్రపుకొత్తూరు రూరల్‌/టెక్కలి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తిత్లీ తుపాను మిగిల్చిన నష్టాన్ని భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. తమకు జీవనాధారమైన జీడి పంట కళ్ల ముందే నాశనం కావడంతో తట్టుకోలేకపోయింది. పంట సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఉరి వేసుకుని అర్ధాంతరంగా తనువు చాలించింది. హృదయ విదారకమైన ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం చినవంక గ్రామంలో చోటు చేసుకుంది. సైని నారాయణమ్మ(49) భర్త అనందరావు ఏడేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు కుమారులున్నారు. వారు పొట్ట చేత పట్టుకుని ఉపాధి కోసం విజయవాడకు వలస వెళ్లారు.

తుపాన్‌ వల్ల పాడైపోయిన పంట నష్టాన్ని అధికారులు నమోదు చేస్తుండడంతో నారాయణమ్మ పెద్ద కుమారుడు దిలీప్‌ కుమార్‌ స్వగ్రామానికి వచ్చాడు. ఏళ్ల తరబడి తాము సాగు చేసుకుంటున్న రెండున్నర ఎకరాల జీడితోటను చూసేందుకు నారాయణమ్మ, దిలీప్‌కుమార్‌ కలిసి శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లారు. అక్కడ తిత్లీ తుపాన్‌ ధాటికి విరిగి పడిపోయిన చెట్లను చూసి నారాయణమ్మ తీవ్ర ఆవేదనకు గురైంది. పంట సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలంటూ విలపించింది.  కొడుకును తోట వద్దే వదిలేసి ఇంటికి చేరుకుంది. ఇంటి చూరుకు తాడుతో ఉరివేసుకుంది. ఈ ఘటనపై వజ్రపుకొత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ఉపిరి ఆగిన ఉద్దానం 
ఉద్దానం... ఉత్తరాంధ్ర కోనసీమ. ఇది ఒకప్పటి మాట. ప్రకృతి పగబట్టింది. తిత్లీ తుపాన్‌ ఉద్దానంను కబళించింది. పచ్చటి చేలు, తోటలతో అరారుతున్న ప్రాంతాన్ని మరుభూమిగా మార్చేసింది. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి డివిజన్‌లోని 11 మండలాలు, పాలకొండ డివిజన్‌లోని పాతపట్నం, మెలియాపుట్టి మండలాలను తిత్లీ తుపాన్‌ దారుణంగా దెబ్బతీసింది. జీడితోటలు గంటల వ్యవధిలో నేలకూలాయి. తిత్లీ తుపాన్‌ వచ్చి పోయి 10 రోజులు గడిచినా ఉద్దానం ప్రాంతంలో పరిస్థితి ఇప్పటికీ అస్తవ్యస్తంగానే ఉంది. ఉద్దానం ప్రాంతంలో దాదాపు 84 వేల ఎకరాల్లో జీడితోటలు ఉన్నాయి. తుపాన్‌ ధాటికి ఇందులో దాదాపు 74 వేల ఎకరాల్లో తోటలు ధ్వంసమయ్యాయి. కాపు కొచ్చిన జీడితోటలు నేలకూలడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. జీడిపప్పు పరిశ్రమపై ఆధారపడిన 19,500 మంది కార్మికులు ఉపాధి కోల్పోయి బజారున పడాల్సిన పరిస్థితి దాపురించింది. తిత్లీ తుపానుతో జీడి పరిశ్రమకు రూ.450 కోట్ల మేర నష్టం వాటిల్లింది. పలాస ప్రాంతంలో 220 వరకు జీడి పరిశ్రమలు ఉండగా, వీటిలో 183 పరిశ్రమలు నేలమట్టం అయ్యాయి. ఉద్దానం ప్రాంతానికి మళ్లీ పూర్వవైభవం రావాలంటే కనీసం దశాబ్ద కాలం పడుతుందని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. 

బోరుమంటున్న జీడి రైతులు
30, 40 సెంట్లు మొదలు 5, 10 ఎకరాల వరకు ఉన్న జీడిరైతుల గోస చెప్పనలవి కాకుండా ఉంది. ఉద్దానం ప్రాంతంలో ఏ రైతును కదిపినా గుండెల్ని పిండేసే కథలే. ఈ ప్రాంతానికి తుపాన్లు, అల్పపీడనాలు కొత్త కాకపోయినా ఇప్పుడు జరిగినంత విధ్వంసం గత 60, 70 ఏళ్లలో ఎన్నడూ జరగలేదని వాపోతున్నారు. తమ తోటల్లో తామే కూలీలుగా మారాల్సి వస్తుందని ఊహించలేదని బావురుమంటున్నారు. ఇప్పుడు కూలిపోయిన చెట్లను తీసివేయాలంటే ఎకరానికి రూ.15 వేల వరకు ఖర్చవుతుంది. ప్రభుత్వం ఇచ్చే నామమాత్రపు సాయం కూలిపోయిన చెట్లను తీసివేయడానికి కూడా సరిపోదు. తిరిగి తోటలు వేస్తే మరో ఐదేళ్ల వరకు పంట చేతికి రాదు, ఎలాంటి ఆదాయం ఉండదు. అప్పటిదాకా తామెలా బతకాలని రైతులు ఆవేదనతో కుమిలిపోతున్నారు. 

పండుగ నాడూ పస్తులే 
గత సంవత్సరం దసరా పండుగ సందర్భంగా కోలాహలంగా కనిపించిన ఉద్దానం ప్రాంతం ఈసారి వెలవెలబోయింది. పండగ పూటా పస్తులే మిగిలాయి. పోయ్యిలో పిల్లి లేస్తే ఒట్టు. పండక్కి కనిపించే కోలాటాలు లేవు, కర్రసాములు లేవు, చెక్కభజనలు లేవు. అమ్మవారికి పూజలు లేవు. అరక సామాగ్రికి పూజలు లేవు. పశువుల అలంకరణ లేదు. సొంత వాహనాలకు పసుపు కుంకుమలు లేవు. కూలిపోయిన ఇళ్లు, గాలికెగిరిపోయిన ఇంటి పైకప్పులు, మొండి గోడల మధ్య తుపాన్‌ బాధితులు దిష్టిబొమ్మల్లా మిగిలిపోయారు. స్వచ్ఛంద సంస్థలు వాహనాల్లో తీసుకొచ్చి పెట్టే తిండి కోసం, ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు వండి పెట్టే భోజనం కోసం బాధితులు బారులు తీరుతుండడం చూపరులను కలచి వేస్తోంది. 

మీ కాళ్లు పట్టుకుంటా.. మంచినీళ్లు ఇవ్వండి 
తులశమ్మ అనే మహిళ ఆమనపాడు వద్ద జీడితోటల్లో నివాసం ఉంటోంది. ఐదారు కుటుంబాలు తోటల మధ్యనే ఇళ్లు కట్టుకుని ఉంటున్నాయి. తిత్లీ తుపాన్‌ దెబ్బకు తోటలు నామరూపాల్లేకుండా పోయాయి, ఇళ్లు నేలమట్టమయ్యాయి. పిల్లాజెల్లలతో రోడ్డు మీదున్న ఓ ఇంట్లో తలదాచుకుంటున్న తులశమ్మ అక్కడ ఏదైనా వాహనం కనిపిస్తే ఆపండి ఆపండి అంటూ అడ్డం తగులుతోంది. అయ్యా మీ కాళ్లు పట్టుకుంటా, మంచినీళ్లుంటే ఇవ్వండయ్యా అంటూ వేడుకుంటోంది. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని కన్నీళ్లు పెట్టుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement