
ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
పులిచెర్ల (కల్లూరు): ఆలయ ప్రారంభోత్సవంలో ఇచ్చిన ఉప్మా, పొంగలి తిని 80 మంది భక్తులు అస్వస్థతకు గురైన ఘటన చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం పాతపేట పంచాయతీ పూరేడువారిపల్లెలో చోటుచేసుకుంది. గ్రామంలో కొత్తగా నిర్మించిన రామాలయాన్ని శనివారం ప్రారంభించారు. గ్రామస్తులు, వారి బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం ఆలయం వద్ద భక్తులకు ఉప్మా, పొంగలి వడ్డించారు. మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. సాయంత్రం నుంచి ఒక్కొక్కరికి వాంతులు, విరోచనాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 80 మంది అస్వస్థతకు గురికావడంతో 108కు సమాచారం అందించారు.
రాత్రి మూడు గంటల సమయంలో మూడు అంబులెన్స్‌లలో కొందరు బాధితులను పీలేరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుల సంఖ్య ఎక్కువ కావడంతో ఆదివారం ఉదయం పూరేడువారిపల్లెలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందించారు. విందుకు వచ్చిన ఫించా, పాకాల, మొగరాల వాసులకు కూడా ఇదే పరిస్థితి ఉండడంతో చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రుల్లో చేరారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీలేరు ప్రభుత్వాస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు.
ఆహారాన్ని పరీక్షిస్తున్నాం
బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. ఆహారం కలుషితం కావడానికి కారణాలు పరీక్షల్లో వెల్లడవుతుంది. పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపాం. ప్రస్తుతం ఎవరికి ఎటువంటి ఇబ్బందీ లేదు.
– ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్ చంద్రశేఖర్
Comments
Please login to add a commentAdd a comment