93.05 శాతం పల్స్‌పోలియో నమోదు
నెల్లూరు (అర్బన్): జిల్లా వ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. 93.05 శాతం పల్స్‌పోలియో నమోదైంది. 3,06,238 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. జిల్లాలో 3,29,112 మంది ఐదేళ్ల లోపు పిల్లలున్నట్లు గుర్తించారు. అర్బన్ పరిధిలో 487, గ్రామీణ ప్రాంతాల్లో 2,551 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేశారు. 88 మొబైల్ బూత్‌లు అందుబాటులో ఉంచారు.
308 మంది రూట్ సూపర్‌వైజర్లు, 27 మంది ఉన్నతాధికారులు, 1966 మంది ఆశ వలంటీర్లు, 3,682 మంది ఐసీడీఎస్ సిబ్బంది, 896 మంది పారామెడికల్ స్టాఫ్, 3,050 మంది ఐకేపీ సభ్యులు, 2,044 మంది ఉపాధ్యాయులు, 514 మంది నర్సింగ్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. సోమ, మంగళవారాల్లో సిబ్బంది ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయనున్నారు. సిబ్బంది ముమ్మరంగా పాల్గొని చుక్కలు వేయాలని డీఎంహెచ్‌వో భారతిరెడ్డి ఆదేశాలిచ్చారు.
పోలియో కేంద్రాల్లో వసతుల కరువు..
పోలింగ్ కేంద్రాల్లో వసతుల గురించి అధికారులు పట్టించుకోలేదు. చుక్కల మందుకు ఎండ తగలకూడదని తెలిసినా షామియానాలు ఏర్పాటు చేయలేదు. కొందరు ఎండలోనే ఉండి చుక్కలు వేయాల్సి వచ్చింది. సిబ్బంది, తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పలేదు. నెల్లూరు నగరంలో చుక్కలు వేసేందుకు అధికారులు నర్సింగ్ విద్యార్థులను ఉపయోగించుకున్నారు. చాలా మంది విద్యార్థులకు కార్పొరేషన్ అధికారులు భోజనాలు అందజేస్తారని అధికారులు చెప్పినా ఆచరణలో అమలుకాలేదు. విద్యార్థులే సొంత డబ్బులతో భోజనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్ర పరిశీలకుడి ఆగ్రహం..
పోలియో చుక్కల కార్యక్రమానికి రాష్ట్ర పరిశీలకుడిగా దశరధరామయ్యను ప్రభుత్వం నియమించింది. ఈయన గూడురు పట్టణంలోని పలు ప్రాంతాల్లో పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాలను పరిశీలించారు. అరకొర వసతులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బజారువీదిలోని గాంధీబొమ్మ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో ఏఎన్‌ఎంలు ఎవరూ లేకుండా కేవలం అంగన్‌వాడీ కార్యకర్త, ఆయాలు మాత్రమే ఉండటాన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేసారు.
పోలియో చుక్కల మందుకు ఎండ వేడి తగలకూడదని, సిబ్బంది కూడా ఎండలోనే ఉంటూ పనిచేస్తున్నారని ఈ కేంద్రం వద్ద షామియానాలు కూడా ఏర్పాటు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే కేంద్రాన్ని నీడ ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేయించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో ఈదూరు సుధాకర్ గూడూరులోని పెద్దపరిగ కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమానికి సంబంధించిన డబ్బులు డ్రా చేయకపోవడం, ఏర్పాట్లు బాగోలేకపోవడంతో ఆగ్రహించిన ఆయన యూడీసీ క్లర్క్‌కు మెమో అందజేశారు.