
సాక్షి, అమరావతి : పోలీస్ శాఖలో వీక్లీ ఆఫ్ అమలు చేసేలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పోలీసు వీక్లీ ఆఫ్‌లకు సంబంధించి డీజీపీ మంగళవారం సాక్షి టీవీతో మాట్లాడారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం పోలీస్ సంస్కరణలు, సంక్షేమానికి తొలి అడుగని ఆయన అభివర్ణించారు. ఈ స్పూర్తితో పోలీసులు మరింత మెరుగైన సేవలతో ప్రజలకు చేరువ అవుతారని పేర్కొన్నారు.
అలాగే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయడుకు సెక్యూరిటీ తగ్గించారనే ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. ఎన్నికల తరువాత రాష్ట్రంలో రాజకీయ దాడులు జరుగుతున్నాయనేది అవాస్తవం అన్నారు. శాంతిభద్రతల విషయంలో నిష్పాక్షికంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు. పోలీస్ శాఖలో ప్రక్షాళన జరగాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని వెల్లడించారు. ఇకపై పోలీస్ అధికారుల బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. గతంలో ఏసీబీ జరిపిన దాడులపై వస్తున్న ఆరోపణలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఏసీబీ కూడా చట్ట ప్రకారమే వ్యవహరించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment