విజయవాడ(బస్‌స్టేషన్): జాతీయ రహదారిపై ప్రయాణికులతో ఉన్న ఆర్టీసీ బస్సుకు నిప్పంటుకుంది. సేకరించిన వివరాల ప్రకారం చిలకలూరిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఇంద్రా సర్వీసు (ఏపీ 07 జెడ్ 0101) చిలకలూరిపేట నుంచి గుంటూరు మీదుగా విజయవాడకు ఉదయం 40 మంది ప్రయాణికులతో బయల్దేరింది. గుంటూరులో సుమారు 30 మంది దిగిపోగా అక్కడ నుంచి సుమారు పదిహేను మంది ప్రయాణికులతో బస్సు నగరానికి వచ్చింది. వారధి సమీపంలో మరికొంతమంది దిగిపోగా, ఏడుగురు ప్రయాణికులతో పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు చేరుకోవాల్సి ఉంది.
డ్రైవర్ ఎం.ఎస్.నాయక్ బస్సులో వాసన రావడంతో బస్టాండ్ గ్యారేజీలో చూపాలని బస్సును పోనిచ్చాడు. కృష్ణలంక స్వర్గపురి సమీపంలోకి చేరుకోగానే బస్సులో పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై ఇంజన్‌ను ఆఫ్‌చేసి ప్రయాణికులను కిందకు దిగమని చెప్పాడు. చూస్తుండగానే బస్సులో మంటలు రేగి ఎదుటభాగం అగ్నికి ఆహుతయ్యింది. అది శీతలీకరణ బస్సు కావడంతో సిలిండర్లు ఉన్నందున పేలుతుందన్న భయంతో ఫైర్‌సర్వీసుకు ఫోన్ చేశారు. వారు సంఘటానా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు రూ.45వేల నష్టం సంభవించినట్లు అంచనా వేశారు.
సంఘటనా స్థలానికి అధికారులు...
ప్రమాదం జరిగిన సంఘటనా స్థలానికి ఆర్టీసీ అధికారులు ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్లు ఎన్.వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, ఇన్‌చార్జ్ రీజనల్ మేనేజర్ నాగేంద్రప్రసాద్, సీటీఎంలు శ్రీరాములు, జాన్‌సుకుమార్, కృష్ణలంక సీఐ మూర్తి, ఎస్‌ఐ రమేష్ చేరుకుని పర్యవేక్షించారు.