
ప్రాణం తీసిన భయం
కదులుతున్న రైలు నుంచి దిగుతూ కింద పడి యువకుడి మృతి
సామర్లకోట(తూర్పుగోదావరి జిల్లా ) : రైల్వే అధికారులు కేసు రాస్తారనే భయం ఓ యువకుడి ప్రాణం తీసింది. కదులుతున్న రైలు నుంచి దిగుతూ దాని కిందపడి తునికి చెందిన కొత్తల సురేష్ గురువారం మృతి చెందాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం తునికి చెందిన కొత్తల సురేష్ (33) ఒక ప్రెవేటు వైద్యశాలలో వార్డు బాయ్‌గా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి 8.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి సామర్లకోటకు ప్యాసింజరు రైలు టిక్కెట్టు తీసుకున్నాడు.
అయితే వెంటనే వచ్చిన ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కేశాడు. ఆ రైలు నుంచి సామర్లకోట స్టేషన్‌లో దిగితే అధికారులు కేసు రాస్తారనే భయంతో సురేష్ రైలు స్టేషన్‌కు సమీపంలో ఉండగానే కెనాల్ రోడ్డు వైపు కంగారుగా దిగేందుకు ప్రయత్నించాడు. దీంతో జారిపోయి అదే రైలు కింద పడ్డాడు. అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి హెచ్‌సీ పవన్‌కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.