పుల్‌కల్, న్యూస్‌లైన్ : అత్తను చంపిన అల్లుడు ఎట్టకేలకు శుక్రవారం కటకటాల పాలయ్యాడు. ఈ కేసు విషయమై జోగిపేట సీఐ సైదానాయక్ శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. శంకరంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కుమ్మరి సంగమ్మ (50)కు నలుగురు కుమార్తెలు. వీరిలో మూడో కుమార్తె కవితకు నారాయణఖేడ్ మండలం సంజీవరావుపేటకు చెందిన కుమ్మరి లక్ష్మణ్‌తో ఐదేళ్ల క్రితం వివాహం అయ్యింది. అయితే లక్ష్మణ్ ఇల్లరికం వచ్చాడు. అప్పటి నుంచి వారు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈ నెల 8న టేక్మాల్ మండలం బోడగట్టు గ్రామంలో జరిగే దినకర్మకు సంగమ్మ, అల్లుడు లక్ష్మణ్‌లు బైక్‌పై హాజరయ్యారు. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్‌కు బైక్‌పై వస్తూ.. పుల్‌కల్ మండలం తాడ్‌దాన్‌పల్లి గ్రామ శివారులోకి రాగానే రాత్రి కావడంతో వాహనాన్ని ఆపాడు. అనంతరం అత్త సంగమ్మను పత్తి చేలల్లోకి ఈడ్చుకెళ్లి రాయితో కొట్టి హత్య చేశాడు. అనంతరం హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించాడు.
అందులో భాగంగానే సంగమ్మ మృతదేహాన్ని బైక్‌పై కట్టుకుని జోగిపేట ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నాడు. అక్కడి వైద్యులకు బైక్ నుంచి కింద పడడంతో తీవ్రంగా గాయపడిందని నమ్మబలికాడు. వారు పరీక్షలు చేయగా అప్పటికే ఆమె మృతి చెందింది. దీంతో విషయాన్ని వారు పోలీసులకు తెలిపారు. అక్కడికి చేరుకుని పోలీసులు మృతిపై అనుమానం వ్యక్తం చేసి మృతురాలి కుమార్తెలకు సమాచారం అందించారు. వారు అక్కడికి రాగానే ఆరా తీశారు. నెల రోజులుగా లక్ష్మణ్ అత్తతో నాలుగవ కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసి, ఉన్న రెండెకరాల భూమిని తన పేరు రాయించాలని వేధిస్తున్నట్లు వివరించారు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అందులో లక్ష్మణ్ నిందితుడిగా తేలడంతో శుక్రవారం అతన్ని రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో పుల్‌కల్ ఎస్‌ఐ రమేష్, కానిస్టేబుల్ ఉన్నారు.