ఆరు లేన్ల రహదారికి అడ్డంకి | A six-lane highway barrier | Sakshi
Sakshi News home page

ఆరు లేన్ల రహదారికి అడ్డంకి

Published Sun, Oct 20 2013 1:36 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

A six-lane highway barrier

 

=చేతులెత్తేసిన నిర్మాణ సంస్థ
=టెండర్ల రద్దుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధం

 
విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి: ఆనందపురం- అనకాపల్లి మధ్య తలపెట్టిన ఆరులేన్ల రహదారి నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. రూ.760 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులను రెండేళ్ల కిందట దక్కించుకున్న సంస్థ ఇప్పటి దాకా ప్రారంభించలేదు. దీంతో ఈ టెండర్లు రద్దుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖలో రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు ఆనందపురం నుంచి అనకాపల్లి వరకు 58.222 కిలో మీటర్ల దూరం ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి ఐదేళ్లుగా కసరత్తు జరుగుతోంది.

ప్రాథమికంగా రూ. 760 కోట్ల వ్యయమయ్యే ఈ పనికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రెండేళ్ల కిందట టెండర్లు పిలిచింది. ట్రాన్‌స్ట్రాయ్ నిర్మాణ సంస్థ సుమారు 25 శాతం తక్కువ అంచనాలతో టెండర్లు వేసి పనులను దక్కించుకుంది. ఇందుకోసం సుమారు రూ.100 కోట్లు బ్యాంక్ గ్యారంటీగా చూపింది. టెండర్లు ఖరా రై నిర్మాణానికి సంబంధించిన అగ్రిమెంటు చేసుకున్న తర్వాత ఆ సంస్థ రోడ్డు నిర్మాణ పనుల మీద అనాసక్తి చూపుతూ వచ్చింది. నిర్మాణానికి సంబంధించిన అగ్రిమెంటు పూర్తయిన రెండు మూడు నెలల్లోపే పనులు ప్రారంభించాల్సి ఉండగా ఏడాది గడిచినా ఆ ఊసే ఎత్తలేదు. దీంతో అధికారులు అనేక సార్లు నోటీసులు ఇచ్చారు.

ట్రాన్‌స్ట్రాయ్ అభ్యర్థన మేరకు అనేక సార్లు గడువు పొడిగించారు. కానీ టెండర్లు ఖరారై రెండేళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభించక పోవడంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవలే చివరి నోటీసు ఇచ్చినట్టు తెలిసింది. నవంబర్ 13వ తేదీ లోగా పనులు ప్రారంభించకపోతే టెండరు రద్దు చేస్తామని ఇందులో స్పష్టం చేసినట్టు సమాచారం. పనులు దక్కించుకున్న సమయానికి ఇప్పటికీ నిర్మాణ వ్యయం భారీగా పెరగడంతో ఆరు లేన్ల నిర్మాణ పని తమకు గిట్టుబాటు కాదని నిర్మాణ సంస్థ భావిస్తున్నట్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు.

పనుల జాప్యానికి తమ తప్పేమీ లేదని, అందువల్ల తాము చూపిన బ్యాంక్ గ్యారంటీ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలనే వాదన లేవనెత్తినట్టు తెలుస్తోంది. టెండరు రద్దు చేసినా తమ బ్యాంక్ గ్యారంటీ విడుదల చేస్తే సదరు పని వదిలేసుకోవడానికి ఆ సంస్థ సిద్ధంగా ఉందనే వాదనలూ వినిపిస్తున్నాయి. ప్రభుత్వం టెండరు రద్దు చేస్తే బ్యాంక్ గ్యారంటీ మొత్తం వెనక్కి వచ్చే అవకాశం లేదని, ఇదే జరిగితే సదరు సంస్థ న్యాయపోరాటానికి దిగితే కొత్తగా టెండర్లు పిలిచే ప్రక్రియ తీవ్ర ఆలస్యం జరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వం ఖరారు చేసిన టెండరు అగ్రిమెంటులో 58.222 కిలో మీటర్ల దూరంలో భూసేకరణతో పాటు నాలుగు పెద్ద బ్రిడ్జిలు, 8 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు,  34 చిన్న బ్రిడ్జిలు, 60 బాక్స్ కల్వర్టులు, 148 పైప్ కల్వర్టులు, 78 శ్లాబ్ కల్వర్టులతో పాటు అగనంపూడి వద్ద టోల్‌గేట్ భవనం నిర్మించాల్సి ఉంది. ఆనందపురం నుంచి సబ్బవరం,పెందుర్తి మీదుగా అనకాపల్లి హైవేలోకలిసే ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే విశాఖ నగరంలో కూడా ట్రాఫిక్ కష్టాలు తప్పే అవకాశం ఉంది.

ఇలాంటి భారీ నిర్మాణ పనికి సంబంధించిన టెండరు ఒక్కసారి రద్దయితే మళ్లీ తాజా అంచనాలు రూపొందించడం, టెండర్లు నిర్వహించడం, ఖరారు చేయడం లాంటి పనులకు మరో ఏడాది నుంచి రెండేళ్ల సమయం పడుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement