రండి బాబూ రండి
► ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరు పల్చన
► ఇంజినీరింగ్ కాలేజీల్లో 30వేల సీట్లు
► అర్హత సాధించినవారు 9,900
► కౌన్సెలింగ్‌కు హాజరైన వారు 4,500 మంది
► సీట్ల భర్తీపై యాజమాన్యాల దిగులు
యూనివర్సిటీక్యాంపస్: జిల్లాలో ఈసారీ ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు మిగిలే అవకాశాలున్నాయి. ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం నుంచి విద్యార్థుల స్పందన అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. గురువారం వరకు లక్షా 15వేల ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించగా 4,500 మంది మాత్రమే హాజరయ్యారు. మరో రెండు రోజులే మిగిలి ఉన్నాయి. చివరి రోజుల్లో 15వందలకు మించి హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అయినా హాజరయ్యేవారి సంఖ్య 6 వేలకు మించే అవకాశం లేదు. ఫలితంగా చాలా కళాశాలల్లో సీట్లు భారీగా మిగిలిపోనున్నాయి.
టాప్ ర్యాంకర్లు దూరం :
ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి ఈనెల 8 నుంచి వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. తొలిరోజు 8 వేల ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించగా, 156 మంది మాత్రమే హాజరయ్యారు. తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ జరుగుతోంది. చిత్తూరులోని పీవీకెఎన్ కళాశాలలో కూడా నిర్వహిస్తున్నారు. ఈ మూడిం టిలో కూడా గతంతో పోల్చితే స్పందన తక్కువగానే ఉంది. ఎస్వీయూ, శ్రీపద్మావతి మహిళా వర్సిటీ, కలికిరిలోని జేఎన్‌టీయూ పరిధిలో 42 ఇం జినీరింగ్ కళాశాలలు ఉన్నాయి.
వీటితో పాటు 39 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. వీటిలో 30వేల సీట్లున్నాయి. కౌన్సెలింగ్‌కు హాజరయిన వారి సంఖ్య తక్కువగా ఉండడంతో సీట్ల భర్తీపై అనుమానాలు నెలకొన్నాయి. ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాలల్లో బుధవారం ప్రారంభమైన డ్యూయల్ డిగ్రీ కోర్సుకు కూడా స్పందన తక్కుగానే కనిపించింది. 400 మందికి కౌన్సెలింగ్ నిర్వహిస్తే 105 మంది మాత్రమే అడ్మిషన్ పొంద డం విశేషం. రెండో రోజు 89 మంది మాత్రమే అడ్మిషన్ పొందారు. రెండు రోజులు కలిపి 900 మందికి కౌన్సెలింగ్ నిర్వహిస్తే 194 మంది మాత్రమే అడ్మిషన్ పొందారు, 226 సీట్లు మిగిలిపోవడం విశేషం.
గత ఏడాది 10,793 మంది ఎంసెట్ పరీక్ష రాశారు. వీరిలో 9,800 మంది అర్హత సాధించారు. ఈ ఏడాది 9,969 మంది అర్హత సాధించారు. గత ఏడాది కన్వీనర్ కోటాలో 8 వేల సీట్లు మిగిలిపోయాయి. ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున సీట్లు మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఆందోళనకు చెందుతున్నాయి.