ఏచూరికే చాన్స్!
- సీపీఎం నూతన సారథిగా దాదాపు ఖరారు
విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కొత్త రథసారథి (ప్రధాన కార్యదర్శి)గా సీతారాం ఏచూరి పేరు దాదాపు ఖరారైంది. శనివారం విశాఖలో జరిగిన సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈమేరకు నేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ సమావేశంలో ఏచూరి కూడా పాల్గొనడం ఆయన నియామకానికి మరింత ఊతమిచ్చినట్లయింది. ఏదైనా అత్యంత కీలక పరిణామం జరిగితే పేరు మారవచ్చని, లేదంటే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆదివారం మధ్యాహ్నానికి ఏచూరి పేరును అధికారికంగా ఖరారు చేస్తారని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. పార్టీ అత్యున్నత పదవికి ఏచూరి, రామచంద్రన్ పిళ్లై పోటీ పడుతున్నారు. దీంతో పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీ 50 ఏళ్ల చరిత్రలో ఇంత గట్టి పోటీ జరగడం ఇదే ప్రథమం. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ కూడా నూతన సారథిపై తన మనసులో మాట బయటపెట్టలేదు.
శనివారంనాటి పరిణామాలు, సీనియర్ నేత అచ్యుతానందన్ ఏచూరికి శుభాకాంక్షలు తెలపడం, ఏచూరి పొలిట్ బ్యూరోలో పాల్గొనడం వంటి ఘటనలు ఆయన ప్రధాన కార్యదర్శి అవుతారన్న వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ప్రధాన కార్యదర్శి పదవికి పోటీలో ఉన్న రామచంద్రన్ పిళ్లై కూడా దీనిపై నోరు విప్పలేదు. ‘సీతారాం ఏచూరికి అచ్యుతానందన్ శుభాకాంక్షలు చెప్పారు. మీకు చెప్పారా?’ అని విలేకరులు పిళ్లైని అడగ్గా.. ‘‘ఏచూరికి ఏమి చెప్పారో నాకు తెలియదు, నాకైతే చెప్పలేదు’’ అని అసహనం వెలిబుచ్చారు. పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవన్నారు. పొలిట్ బ్యూరో సమావేశమై కేంద్ర కమిటీ కూర్పుపై ముసాయిదాను రూపొందిస్తుందని, దానిని ప్రస్తుత కేంద్ర కమిటీ ముందుంచుతుందని చెప్పారు. ఇది కూడా ప్రతిపాదన మాత్రమేనని, మహాసభకు హాజరైన ప్రతినిధులు కేంద్ర కమిటీని ఎన్నుకుంటారని అన్నారు.
విశాఖలో నేడు సీపీఎం బహిరంగ సభ
సీపీఎం 21వ జాతీయ మహాసభల చివరిరోజైన ఆదివారం విశాఖపట్నంలో భారీ బహిరంగసభ జరగనుంది. ఇక్కడి ఆర్‌కే బీచ్‌లో కాళీమాత ఆలయం వద్ద నిర్వహిస్తున్న ఈ సభకు లక్షమందికిపైగా హాజరవుతారని అంచనా. బహిరంగసభకు పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. సభలో పార్టీ ప్రముఖులు ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు, సీతారాం ఏచూరి, బృందాకారత్‌తోపాటు త్రిపుర సీఎం మాణిక్ సర్కార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ నరసింగరావు ప్రసంగిస్తారు. సభకు ముందు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని సంపత్ వినాయక టెంపుల్ నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు మహా ప్రజాప్రదర్శన ప్రారంభమవుతుంది.