కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీతో ప్రజా స్వామ్యానికి ముప్పు ఉందని భాతర కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు.
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీతో ప్రజా స్వామ్యానికి ముప్పు ఉందని భాతర కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక ఇందిరాగాంధి నగర్‌లోని సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తల జనరల్‌బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కుంభకోణాలతో కాంగ్రెస్ పాలన అవినీతి కంపు కొడుతుందన్నారు.
బీజేపీ అంటే గుజరాత్‌లో జరిగినలో మత ఘర్షణలు గుర్తుకు వస్తాయన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా భారత రాష్ట్ర రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగంపై ఆయన అభ్యంతకరం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు దాన ధర్మాలు చేసే సంస్థలు కాదని చెప్పడం సరైంది కాదన్నారు. పేదలు ప్రభుత్వాల నుంచి సబ్సిడీలు, సంక్షేమ పథకాలు, సబ్సిడీలు, గాస్ సిలిండర్లపై రాయితీలు, రైతులు ఉచిత విద్యుత్ వంటివి ఆశించరాదని ఇందులో అర్థముందర్నారు.
మరో విషయంగా సంకీర్ణ ప్రభుత్వాలు సరైన పరిపాలన అందించడం లేదని, సుస్థిర ప్రభుత్వాని ఎన్నుకోవాలని సూచించడం సరైంది కాదన్నారు. చిన్న, ప్రాంతీయ, ఇతర పార్టీలకు ఓట్లు వేయకుండా కాంగ్రెస్‌కు లేదా బీజేపీకే ఓట్లు వేసి గెలింపించాలన్నదే ఆయన మాటల్లోని మర్మమన్నారు. రాష్ట్రపతి హోదాలో మాట్లాడుతూ కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరే విషయాలను ప్రస్తావించారన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్, తెలుగుదేశం అవకాశవాదంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అసెంబ్లీలో మూడు నాలుగు గంటలు మాట్లాడి కాంగ్రెస్ వాది, సమైక్యవాది అని చెప్పుకోవడం సరి కాదన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గఫూర్ మాట్లాడుతూ రాబోవు ఎన్నికల్లో ప్రజా సమస్యలను విస్మరించిన పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. అల్కాలీస్ పరిశ్రమల కాలుష్యంతో ప్రజలు అల్లాడుతుంటే మంత్రి టీజీ వెంకటేష్ అధికార బలంతో సమస్యను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ఆపార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు టి. షడ్రక్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, నరగ కార్యదర్శి గౌస్‌దేశాయ్, జిల్లా కమిటీ సభ్యులు నిర్మల, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.