72లక్షల వాహనాలకు, 41లక్షల డ్రైవింగ్ లెసైన్సుదారులకు ఆధార్ కావాల్సిందే
ఆయిల్ కంపెనీలతో రవాణాశాఖ సమావేశం
ఈ నెల 13 నుంచి బంకుల్లో టాస్క్‌ఫోర్సు టీమ్‌లు
ఇంధనానికి వెళితే సి-బుక్, డ్రైవింగ్ లెసైన్సు తప్పనిసరి
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆధార్ అనుసంధానంకోసం పెట్రోల్ బంకులను ఆశ్రయించాలని రవాణాశాఖ నిర్ణయించింది. ఈ విషయమై హెచ్‌పీసీఎల్, బీపీఎల్, ఐఓసీ ఆయిల్ కంపెనీలతో రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, ఉన్నతాధికారులు ఇప్పటికే రాష్ట్రస్థాయి కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. రవాణాశాఖ ప్రతిపాదనకు ఆయిల్ కంపెనీల ప్రతినిధులు అంగీకరించడంతో త్వరలోనే జీవో విడుదల కానుంది. రాష్ట్రంలోని 13జిల్లాల్లో 72లక్షల వాహనాలు, 41లక్షల డ్రైవింగ్ లెసైన్సులు ఉన్నట్టు గుర్తించారు. వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్(సి బుక్)లు, డ్రైవర్లు(డ్రైవింగ్ లెసైన్సు)లకు నాలుగు నెలల నుంచి ఆధార్ అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితమివ్వలేదు. దీంతో రవాణా శాఖ నేరుగా రంగంలోకి దిగి కృష్ణా జిల్లా గుడివాడ, కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రయోగాత్మకంగా ఇంటింటికి వెళ్లి ఆధార్ అనుసంధానం చేపట్టారు. అయితే పగటిపూట సర్వేకు ఇళ్ల వద్ద జనం అందుబాటులో లేకపోవడంతో ఇకపై పెట్రోల్ బంకుల్లో చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం పెట్రోల్ బంకుల్లో ఈ నెల 13 నుంచి టాస్క్‌ఫోర్సు టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ జిల్లాలోను కనీసం 40కి తగ్గకుండా ఆయిల్ బంకుల్లో ఈ పద్ధతిని చేపడతారు. మెప్మా సిబ్బంది, హోంగార్డులు, బంకు డీలర్ల ప్రతినిధులు ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. బంకుకు వచ్చే ప్రతీ వాహనం, డ్రైవర్లు ఇకనుంచి సి బుక్, డ్రైవింగ్ లెసైన్సు, ఆధార్ కార్డులను వెంట తీసుకుని రావాల్సి ఉంటుంది. ఒకసారి వాటిని తీసుకుని రాకపోతే మరో అవకాశం ఇస్తారు. అక్కడిక్కడే వాటిని ఆధార్‌తో అనుసంధానం చేస్తారు.
ఆధార్ అనుసంధానం మేలంటున్న రవాణాశాఖ..
ఆధార్ అనుసంధానంతో ఒకే వ్యక్తికి, ఆయన కుటుంబానికి ఎన్ని వాహనాలు ఉన్నాయి, చిరునామా, ఇతర వివరాలు ఆన్‌లైన్ చేసే వీలుంటుంది. ప్రస్తుతం ఉన్న సి బుక్, డ్రైవింగ్ లెసైన్సులు మన రాష్ట్రంలో గుర్తించడానికి సరిపోతాయి. అదే ఆధార్ కార్డు ఉంటే దేశంలో ఎక్కడ ఏం జరిగినా వాహనం, డ్రైవర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే వీలుకలుగుతుంది. వాహనాలపై వెళ్లి చోరీలు, ప్రమాదాలు ఇతర వివరాలు సైతం ఆధార్ హబ్‌లో నెంబరు నమోదు చేస్తే ఇట్టే వివరాలు తెలుసుకునే వీలుంటుంది. దీనికితోడు వాహనాల రిజిస్ట్రేషన్ కాలపరిమితి, డ్రైవింగ్ లెసైన్సు రెన్యువల్ వివరాలు సంబంధిత వ్యక్తి సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు ఇచ్చి అప్రమత్తం చేసేందుకు కూడా ఈ ప్రక్రియను ఉపయోగించు కోనున్నారు.
పెట్రోల్‌కు ‘ఆధార్’ ఇవ్వాల్సిందే
Published Fri, Dec 12 2014 6:33 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM
Advertisement
Advertisement