నిరుద్యోగ ద్రోహి బాబు | Aalla Nani Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ ద్రోహి బాబు

Published Wed, Oct 3 2018 1:12 PM | Last Updated on Wed, Oct 3 2018 1:12 PM

Aalla Nani Slams Chandrababu Naidu - Sakshi

ఏలూరులో నిరుద్యోగుల దీక్షనుద్దేశించి ప్రసంగిస్తున్న ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ సీపీ నేత ఆళ్ల నాని

పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్‌: రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది నిరుద్యోగ యువతను ఘోరంగా మోసం చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని, ఎన్నికల వేళ ఇంటికో ఉద్యోగం, లేకుంటే నెలకు రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తామని  మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం నేడు నిరుద్యోగులను రోడ్లపాలు చేసిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ, ఏలూరు సమన్వయకర్త ఆళ్ల కాళీ కృష్ణశ్రీనివాస్‌ (నాని) విమర్శించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఏలూరు ఫైర్‌స్టేషన్‌ సెంటర్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం ఆ«ధ్వర్యంలో 48 గంటల నిరుద్యోగ దీక్ష చేపట్టారు.  ఎమ్మెల్సీ ఆళ్ల నాని దీక్షా శిబిరాన్ని సందర్శించి నిరుద్యోగులకు సంఘీభావం ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో భారీ సంఖ్యలో పేరుకుపోయిన ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని, ఒకవేళ ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో రూ.2వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చంద్రబాబు గత ఎన్నికల ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పారన్నారు.

అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడిచినా ఇప్పటికీ నిరుద్యోగులను పట్టించుకున్న పాపానపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది నిరుద్యోగ యువత భృతి కోసం దరఖాస్తులు చేసుకుంటే సవాలక్ష ఆంక్షలతో తిరస్కరిస్తూ, తమకు చెందిన వారికి కొందరికి మాత్రమే తూతూమంత్రంగా నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆళ్లనాని తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల్లో  గద్దెనెక్కటం కోసం మోసపు హామీలు గుప్పిస్తూ చివరికి యువత, విద్యార్థులకు సీఎం చంద్రబాబు హ్యాండిచ్చారని ధ్వజమెత్తారు.  సీఎం చంద్రబాబు తన కొడుకు లోకేష్‌కు మాత్రమే మంత్రిగా ఉద్యోగం ఇచ్చుకున్నారని,  లక్షలాదిమంది నిరుద్యోగ యువతను నట్టేట ముంచారని ఎద్దేవా చేశారు.

జిల్లాలోనే లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఉంటే కేవలం 500 మంది దరఖాస్తులు మాత్రమే స్వీకరించి, తీరా చివరికి వచ్చే సరికి కేవలం పదిమందికే నిరుద్యోగ భృతి కల్పిస్తామంటే ఎలా అంటూ చురకంటించారు.  ప్రభుత్వం ఇప్పటికైనా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే రాబోయే ఎన్నికల్లో యువత, విద్యార్థులు టీడీపీకి గట్టి బుద్ధిచెబుతారని హెచ్చరించారు.

కాంట్రాక్టు ఉద్యోగులకు మద్దతు
అనంతరం ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో మానవహారం నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ స్టాఫ్‌ నర్సులకు ఆళ్లనాని మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను రెగ్యులర్‌ చేయకుండా శ్రమదోపిడీ చేస్తోందనీ, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ స్టాఫ్‌ నర్సులను వెంటనే రెగ్యులర్‌ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

నిరుద్యోగులపై నిర్లక్ష్యం తగదు
ఈ సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విబాగం జిల్లా అధ్యక్షుడు కందుల దినేష్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వీరంకి సాయి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతను, విద్యార్థులను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. ప్రతి ఇంటికీ ఉద్యోగమో, నిరుద్యోగ భృతో ఇస్తానని ఎన్నికల వాగ్దానం చేసిన సీఎం చంద్రబాబుకు నాలుగున్నరేళ్లు గడిచినా ఇచ్చిన హామీ అమలు చేసేందుకు అవకాశం కుదరటంలేదని, ఇక టీడీపీని నమ్మే స్థితిలో యువత, విద్యార్థులు లేరని స్పష్టం చేశారు. రూ.2వేలు ఇస్తానని మాయమాటలు చెప్పి, ఇప్పుడు కొంతమందికి మాత్రమే రూ.వెయ్యి ఇస్తానని చెప్పటం దారుణమన్నారు.

దీక్షా శిబిరంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్‌ వర్మ, ఏలూరు అధ్యక్షులు ఏలూరు అంజి, నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సీహెచ్‌ సందీప్, నాయకులు జక్కంపూడి సత్య, టీ.దిలీప్, బేత లోకేష్, టీ.వినయ్, ఎస్‌కే.రబ్బానీ, ఏ.రాము, డానియెల్‌ రాజు తదితరులు ఉన్నారు.  వైఎస్సార్‌సీపీ ఏలూరు నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుడిదేశి శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు మంచెం మైబాబు, పార్టీ నేతలు మున్నులజాన్‌ గురునాధ్, జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు, నెరుసు చిరంజీవి, కైసర్,  మహిళా నేతలు మున్నీ, గంపల బ్రహ్మావతి, బాలిన థనలక్ష్మి, బట్టు విజయలక్ష్మి, మోటమర్రి సదానందకుమార్, ఎన్‌.సుదీర్‌బాబు, సుంకర చంద్రశేఖర్, బాలిన నవహర్ష, శశిధర్‌రెడ్డి, ఆచంట వెంకటేశ్వరరావు, చిట్టిబొమ్మ శ్రీను,  బోడా కిరణ్‌కుమార్, తదితరులు దీక్షకు సంఘీభావం తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement