ఆమ్ ఆద్మీ పార్టీతో మాకు పొసగదు: జేపీ
సాక్షి, హైదరాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేసేందుకు ఢిల్లీ వెళ్లి సీఎం అరవింద్ క్రేజీవాల్‌తో చర్చలు జరిపిన లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ ఇప్పుడు అదే పార్టీని చిన్న పిల్లల రాజకీయంతో పోల్చారు. జేపీ శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ ‘చిన్న పిల్లల రాజకీయం చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీతో మాకు పొసగదు’ అని పేర్కొన్నారు. ఆ పార్టీ తీరు మార్చుకోకపోతే ప్రజలకు మేలు చేయలేదన్నారు.
కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందిన రాష్ట్ర విభజన బిల్లు తెలుగు ప్రజల భవిష్యత్తును ఏ మాత్రం కాపాడలేదని చెప్పారు. ఇంత ఆధ్వానంగా బిల్లును తయారు చేయబట్టే.. కనీసం ఏ అంశాన్ని ఎందుకు చేర్చారో చెబుతూ వివరణ ఇచ్చే సాహసం కూడా కేంద్రం చేయలేకపోయిందన్నారు. బిల్లులో ఐదు కీలక మార్పుల కోసం రాష్ర్ట ఎంపీలతోపాటు బీజేపీ గట్టి బాధ్యత తీసుకొని పనిచేయాలని కోరారు. తాను మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించేందుకు నిరాకరించారు.