ఆప్‌తో పొత్తు కోసం జేపీ చర్చలు | Jayaprakash Narayan meets Aravind Kejrival | Sakshi
Sakshi News home page

ఆప్‌తో పొత్తు కోసం జేపీ చర్చలు

Published Sun, Jan 12 2014 2:39 AM | Last Updated on Mon, Aug 20 2018 3:46 PM

Jayaprakash Narayan meets Aravind Kejrival

 పరస్పర సహకారంపై కేజ్రీవాల్‌తో సమావేశం
16న స్పష్టతనిస్తాం
 

 సాక్షి, న్యూఢి ల్లీ: ఆమ్‌ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో ఈ నెల 16న మరోమారు చర్చలు జరిపిన తర్వాత పొత్తు విషయమై స్పష్టతనిస్తామని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ తెలిపారు. దేశంలోని కుళ్లు రాజకీయాలను ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుకుంటున్నారనడానికి ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ విజయమే ఉదాహరణని చెప్పారు. ఆయన శనివారం మధ్యాహ్నం గంటపాటు ఢిల్లీ సచివాలయంలో కేజ్రీవాల్‌తో లోక్‌సత్తా పార్టీ ప్రతినిధులతో కలిసి భే టీ అయ్యారు. అనంతరం ఏపీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పాత మిత్రులైన కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ప్రశాంత్ భూషణ్, చేతన్‌భగత్‌తో స్నేహపూర్వక చర్చలు జరిపామని తెలిపారు. దేశంలో మంచి మార్పు తేవాలని కోరుకుంటున్న పార్టీలుగా ఒకరికొకరు సహకరించుకుంటూ ఎలా ముందుకు వెళ్లాలన్నది చర్చించుకున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై ఈనెల 16న జరిగే సమావేశాల్లో స్పష్టత వస్తుందన్నారు. ఆప్‌లా విజయం సాధించడంలో లోక్‌సత్తా ఎందుకు వెనకబడిందని విలేకరులు ప్రశ్నించగా... అనూహ్య విజయం ఎక్కడో ఒకచోటే వస్తుందన్నారు. అందుకు అనేక స్థానిక పరిస్థితులు కూడా కారణమవుతాయని చెప్పారు. లోక్‌సత్తా ఎనిమిది చట్టాలు, మూడు రాజ్యాంగ సవరణలు తేగలిగినా, ఎన్నికల్లో విజయం సాధించలేకపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని శాసనసభ, లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు.
 
 తెలంగాణకు పరిష్కారం మా దగ్గర ఉంది
 
 తెలంగాణ  ఏర్పాటుపైనా లోక్‌సత్తా పార్టీ ముందునుంచి స్పష్టమైన విధానంతో ఉందని జేపీ తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యమైన ఆ ప్రణాళికను అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడిస్తామని చెప్పారు. ప్రజల ఆకాంక్షకు తగ్గట్టు తెలంగాణ ఏర్పాటు జరగాలే కాని ఢిల్లీ ఆదేశాల మేరకు కాదన్నారు.  
 లోక్‌సత్తాతో పొత్తులపై మాట్లాడుకోలేదు: కేజ్రీవాల్
 లోక్‌సత్తాతో పొత్తుల విషయమై చర్చ జరగలేదని కేజ్రీవాల్ శనివారం స్పష్టంచేశారు. లోక్‌సత్తా విలీనం అవకాశాలను కొట్టిపారేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ సొంత బలంపై పోటీ చేస్తుందని, ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement