
సాక్షి, అమరావతి: నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి డిసెంబర్ 31 రాత్రి నిర్వహించే ఈవెంట్లకు ఇచ్చే పర్మిట్లపై ఎక్సైజ్ శాఖ ఆంక్షలు విధించింది. ముందుగా పోలీసుల అనుమతి తీసుకుని ఎక్సైజ్ శాఖకు దరఖాస్తు చేసుకుంటేనే మద్యం సరఫరా అనుమతులు ఇచ్చే విషయం పరిశీలించాలని నిర్ణయించింది. మద్య నియంత్రణలో వైఎస్ జగన్ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉండడంతో ఈవెంట్ పర్మిట్ల విషయం లోనూ ఎక్సైజ్ శాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. గతంలో అయితే ఈవెంట్ల నిర్వహణకు సంబంధించి లిక్కర్ సరఫరా కోసం నిర్వాహ కులు ఎక్సైజ్ శాఖకు దరఖాస్తు చేసుకునే వారు. ఎక్సైజ్ శాఖలో సూపరింటెండెంట్ స్థాయి అధికారి అంశాల ప్రాతిపదికగా (సబ్జెక్ట్ టు కండిషన్) అనుమతులు ఇచ్చేవారు. ఇప్పుడు అలా కుదరదు.
సాధారణంగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిర్వహించే ఈవెంట్లలో మద్యం వినియోగం ఎక్కువగా ఉంటుంది. గతంలో నూతన సంవత్సరం సందర్భంగా ఒక్క రోజే రూ.150 కోట్ల వరకు మద్యం అమ్మకాలు ఉండేవి. గత ప్రభుత్వం ఆదాయం పెంచుకు నేందుకు మద్యం అమ్మకాలను అర్ధరాత్రి వరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసేది. ఇప్పుడు నిబంధనలు కఠినతరం చేయడంతో ఈ సారి కొత్త ఏడాది వేడుకల ఈవెంట్ల పర్మిట్లకు దరఖాస్తులు భారీగా తగ్గాయి. గతంలో ఒక్క విజయవాడలో 30 నుంచి 40 ఈవెంట్ల పర్మిట్లకు ఎక్సైజ్ శాఖ అనుమతులిచ్చేది. ఈ సారి కేవలం ఐదు ఈవెంట్లకు మాత్రమే దరఖాస్తులు అందాయి. విశాఖలోనూ దరఖాస్తులు పెద్దగా రాలేదని ఎక్సైజ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment