
ప్రవీణ్ ఫోన్ లో పలువురి అభ్యంతకర ఫోటోలు
పలు అకృత్యాలకు పాల్పడుతున్న పోలీస్ ఇన్‌ఫార్మర్ ముప్పర్తి ప్రవీణ్ అనే యువకుడిని తూర్పు గోదావరి పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
మలికిపురం: పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా ఆ శాఖ ఉన్నతాధికారుల అండ చూసుకుని పలు అకృత్యాలకు పాల్పడుతున్న ముప్పర్తి ప్రవీణ్ అనే యువకుడిని తూర్పు గోదావరి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతడి అరెస్టు ఏపీ హోం మంత్రి చినరాజప్ప ప్రమేయంతో జరగ్గా.. తెలంగాణకు చెందిన కొందరు పోలీస్ ఉన్నతాధికారుల జోక్యంతో కేసును బలహీనపరిచే యత్నం జరుగుతోందంటున్నారు.
స్థానిక పోలీసుల కథనం ప్రకారం... మలికిపురం మండలం చింతపల్లికి చెందిన ప్రవీణ్ హైదరాబాద్‌లో ఉంటూ ఇన్‌ఫార్మర్‌గా పలు కేసుల్లో కీలక సమాచారం అందించాడు. కొందరు అధికారుల అండ చూసుకుని ఉన్నత వర్గాలకు చెందిన మహిళలను లోబరుచుకున్నాడు. వారిలో ఓ సినీ హీరో కుటుంబ పు మహిళ, మరో యువహీరో తల్లి, పలు ఉన్నత కుటుంబాల మహిళలు ఉన్నారు. వారిని నగ్నంగా ఫొటోలు తీసి బెదిరించి, తనకు అండగా నిలుస్తున్న కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వాంఛనూ తీర్చమనేవాడు.
మలికిపురంలో కూడా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని పలు అక్రమాలకు పాల్పడ్డాడు. అతడు తమలోనే ఒకరి బంధువుల అమ్మాయిని లోబరుచుకున్నట్టు గుర్తించిన బృందంలోని వారు దాడి చేశారు. ప్రవీణ్ హైదరాబాద్‌లోని పోలీస్ బాస్ ద్వారా స్థానిక పోలీసులకు ఫోన్ చేయించి తనపై దాడి చేసిన వారిపై చర్యలకు ఒత్తిడి తెచ్చాడు. ఈ నేపథ్యంలో ప్రవీణ్‌కు బంధువైన ముప్పర్తి సత్తిరాజుతో గురువారం మలికిపురంలో గొడవ జరిగి పరస్పరం కేసులు పెట్టుకున్నారు.
ఈ వ్యవహారంలోనూ తెలంగాణ పోలీస్ బాస్‌లు ప్రవీణ్‌కు అండగా నిలవడంతో సత్తిరాజు హోం మంత్రి రాజప్పకు తెలపగా స్థానిక పోలీసులు ప్రవీణ్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అతడి కారుకు పోలీస్ స్టిక్కర్, డైరీలో పోలీసులతో ఉన్న సంబంధాలు,సెల్ ఫోన్‌లో పలు ఉన్నత కుటుంబాల మహిళల నగ్న చిత్రాలను గుర్తించారు. అయితే పోలీసులు కేవలం సత్తిరాజు ఫిర్యాదు, కారుకు పోలీస్ స్టిక్కర్ ఉండడంపై 420, 341 సెక్షన్‌ల కింద మాత్రమే కేసు నమోదు చేసి, శనివారం అతన్ని అరెస్టు చేసి అమలాపురం కోర్టుకు తరలించారు.