సాక్షి, అమరావతి: అత్యంత వివాదాస్పద అధికారిగా ముద్ర పడిన ఏబీ వెంకటేశ్వరరావును హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బాస్ బాధ్యతల నుంచి తప్పనిసరై రిలీవ్ చేయాల్సి వచ్చినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం.. ఆయన్ను వదులుకునేది లేదని తేల్చిచెప్పేశారు. ఈసీ ఆదేశించినా.. హైకోర్టు చెప్పినా.. పట్టించుకోకుండా ఇంటెలిజెన్స్ మాజీ బాస్‌ను ప్రస్తుత ఎన్నికల తరుణంలో తన రాజకీయ అవసరాలకోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. అంతేగాక ఆయన్ను వదులుకునేది లేదంటూ కీలక అధికారులకు సంకేతాలిచ్చినట్టు సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ సమీకరణలు, ఎన్నికల అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఏబీవీకి ఇవ్వాలని, ఈ విషయంలో ఆయనకు పూర్తి స్థాయిలో సహకరించాలని పోలీసు బాస్‌లకు, అలాగే జిల్లాల్లోని పోలీసు యంత్రాంగం, పార్టీ యంత్రాంగానికి మౌఖికంగా ఆదేశాలిచ్చినట్టు సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఏబీవీ అనధికార శక్తిగా వ్యవహరిస్తున్నారని, పోలీసు శాఖ, ప్రభుత్వ అధికారులు, టీడీపీ అభ్యర్థులను సమన్వయం చేస్తూ ఏ సమస్య ఉన్నా ఇన్‌వాల్వ్ అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అనధికార శక్తిగా ఏబీవీ..
రాష్ట్రంలో టీడీపీ కోసం ఏబీవీ ఏకపక్షంగా పనిచేస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి అనేకమార్లు ఫిర్యాదు చేయడం, ఈ నేపథ్యంలో వివాదాస్పదమైన ఏబీవీని విధుల నుంచి తప్పించి పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు ఎటాచ్ చేయాలని, ఆయనకు ఎన్నికల విధులు అప్పగించకూడదంటూ ఈసీ ఆదేశాలు ఇవ్వడం తెలిసిందే. అయితే ఏబీవీతో తన రాజకీయ ప్రయోజనాలు ముడిపడి ఉన్నందున చంద్రబాబు ఆయన్ను రిలీవ్ చేయడానికి ససేమిరా అన్నారు. అయితే హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో ఏబీవీని ఇంటెలిజెన్స్ చీఫ్‌గా రిలీవ్ చేయక తప్పలేదు. దీంతో ఏబీవీ పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు పరిమితం కావాల్సి ఉంది. ఈ కారణంగా అధికార పార్టీ సేవలో తరిస్తున్న ఏబీవీని వదులుకోవడం సీఎంకు సుతరామూ ఇష్టం లేకపోయింది. ఏదేమైనా ఏబీవీని పార్టీ కోసం ఉపయోగించుకోవాలని నిశ్చయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆ మేరకు పోలీసు బాస్‌లకు సంకేతాలిచ్చినట్టు, అందరూ ఏబీవీకి రిపోర్టు చేయాలంటూ, ఎన్నికల అంశాలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఏబీవీకి అందజేయాలంటూ మౌఖికంగా సూచించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఏబీవీ తెరవెనుక నుంచి అధికారపార్టీ కోసం వ్యవహారాలు నడిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. చంద్రబాబు సొంత సామాజికవర్గానికి చెందినవాడవడంతోపాటు సొంత మనిషిగా ఉన్న ఏబీవీని పార్టీ కోసం వాడుకోవాలనే ప్రయత్నాలు ఇంకా కొనసాగడంపై సీనియర్ పోలీసు అధికారులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రధానంగా ఇంటెలిజెన్స్ విభాగంలో ఏబీవీ సొంత సామాజిక వర్గం, సొంత మనుషులతో పట్టిష్టమైన నెట్‌వర్క్‌ను పెట్టుకోవడంతో ఆయన మాటే చెల్లుబాటయ్యే అవకాశముందని, అదే జరిగితే ఏబీవీ అనధికార శక్తిగా వ్యవహరించే వీలుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కుమార్ విశ్వజిత్‌ను ఇంటెలిజెన్స్ ఏడీజీగా నియమించినప్పటికీ రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ఇంటెలిజెన్స్ డీఎస్పీలు, దిగువస్థాయి సిబ్బంది సహాయ నిరాకరణ చేసే ప్రమాదం ఉందని ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అనుమానం వ్యక్తం చేశారు.
వాట్సాప్ గ్రూపుల్లో కొనసాగింపు...
ఇంటెలిజెన్స్ బాధ్యతల నుంచి తప్పుకున్న ఏబీవీ ఇంకా వాట్సాప్ గ్రూపుల్లో కొనసాగుతుండడం గమనార్హం. దీని వెనుక చంద్రబాబు ఇచ్చిన మౌఖిక ఆదేశాలే కారణమని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని ఇంటెలిజెన్స్ అధికారులు, జిల్లాలవారీగా అధికారులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు.. ఇలా అనేక రకాల గ్రూపుల్లో ఏబీవీ కూడా ఉన్నారని ఒక పోలీసు అ«ధికారి చెప్పారు. కీలక సందర్భాల్లో ఆయన పలు సూచనలు కూడా వాట్సాప్ గ్రూపుల్లో చేసేవారని అంటున్నారు. ఇటీవల జరిగిన టెలీకాన్ఫరెన్సులోనూ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులు, 25 ఎంపీ అభ్యర్థులకు నేరుగా ఏబీవీ ఫోన్‌నంబర్ ఇచ్చిన చంద్రబాబు ఏ సమస్య వచ్చినా ఆయనకు నేరుగా టచ్‌లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ఏ సమస్య వచ్చినా ఏబీవీ సహకారం తీసుకుంటున్నారని తెలిసింది. అదే సమయంలో పోలీసు శాఖ, ప్రభుత్వ అధికారులు, టీడీపీ అభ్యర్థులను సమన్వయం చేసే పనిలో ఏబీవీ నిమగ్నమైనట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment