అప్పుడలా..ఇప్పుడిలా..ఎలా బాబూ.. | Ap cm chandrababu difference between 2009 election and 2019 election | Sakshi
Sakshi News home page

అప్పుడలా..ఇప్పుడిలా..ఎలా బాబూ..

Published Fri, Mar 29 2019 2:59 AM | Last Updated on Fri, Mar 29 2019 2:59 AM

Ap cm chandrababu difference between 2009 election and 2019 election - Sakshi

సాక్షి, అమరావతి:  ఎన్నికల విధుల్లో నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే చర్యలపై నాలుకను మడతపెట్టి ఎలా బడితే అలా మాట్లాడడం సీఎం చంద్రబాబునాయుడికే చెల్లింది. ప్రతి విషయంలోనూ రెండు నాల్కల ధోరణి అవలంభించే ఆయన ఎన్నికల కమిషన్‌ తీసుకునే చర్యలపై  గతంలోనూ, ఇప్పుడూ పరస్పర భిన్నంగా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఎన్నికలు సజావుగానూ, స్వేచ్ఛగానూ జరగడానికి  అవసరమైన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే 2009లో ఫిర్యాదుల కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ డీజీపీగా ఉన్న ఎస్‌ఎస్‌పీ యాదవ్‌ను ఎన్నికల కమిషన్‌ విధుల నుంచి తప్పించింది. మహంతికి బాధ్యతలు అప్పగించేలా ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు ఇచ్చింది. అలాగే గతేడాది జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డిని రాత్రి సమయంలో అరెస్టు చేయడాన్ని తప్పుబడుతూ వికారాబాద్‌ ఎస్పీ టి.అన్నపూర్ణను ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఎన్నికల సంఘం.. అవినాష్‌ మహంతికి ఎస్పీగా పోస్టింగ్‌ ఇచ్చింది. ఇలా బీహార్, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం ఆయా అధికారులపై వేటు వేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా ఏపీలోనూ కొంతమంది పోలీసు బాస్‌లు అధికార పక్షానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న తరుణంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్న సంగతి తెల్సిందే. అయితే ఈ విషయంలో ఇప్పుడు చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు దేశవ్యాప్త చర్చకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులపై ఈసీ వేటు వేయడంపై చంద్రబాబు వైఖరి తెలుసుకోవాలంటే 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ఎస్‌ఎస్‌పీ యాదవ్‌ ఘటన, ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావుపై చర్యలు.. ఇలా రెండు అంశాల పూర్వపరాలను పరిశీలించాల్సిందే.

నిఘా వ్యవస్థను నీరుగార్చింది బాబే..
పోలీసు వ్యవస్థలో పైకి కన్పించని నిఘా వ్యవస్థగా ఉండే ఇంటెలిజెన్స్‌ విభాగం కీలక పాత్ర పోషించాల్సి ఉంది. శాంతిభధ్రతలకు భంగం కలిగించే సంఘ విద్రోహ శక్తులను, మావోయిస్టు, తీవ్ర వాద కార్యాకలాపాలను కనిపెడుతూ పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన గురుతర బాధ్యత ఇంటెలిజెన్స్‌పై ఉంది. అయితే 2014 ఎన్నికల్లో అధికారం చేపట్టిన చంద్రబాబు ఇంటెలిజెన్స్‌ వంటి కీలక నిఘా వ్యవస్థలోనూ రాజకీయ ప్రయోజనాన్ని చొప్పించడం మొదలుపెట్టారు. ఫలితంగా రాష్ట్ర పౌరుల భద్రతను గాలికి వదిలేసిన ఇంటెలిజెన్స్‌.. చివరకు ఎల్లో నెట్‌వర్క్‌గా మారిపోయిందనే విమర్శలను మూటగట్టుకుంది. ప్రస్తుత ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు జిల్లాల్లో ఇంటెలిజెన్స్‌ డీఎస్పీల నుంచి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలోని ఓఎస్‌డీ వరకు చంద్రబాబు సొంత సామాజికవర్గానికి చెందిన వారితో నింపేశారంటూ లోకం కోడై కూస్తోంది. ఈ వ్యవస్థ పూర్తిగా టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

అప్పుడు ఏం జరిగిందంటే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 2009లో జరిగిన ఎన్నికల్లో మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల్లోని పర్యటన సందర్భంగా అప్పటి డీజీపీ ఎస్‌ఎస్‌పీ యాదవ్‌ తనను కలిసిన పోలీసులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పనితీరు బాగుందంటూ ప్రశంసించారు. దీంతో డీజీపీ యాదవ్‌ ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించారంటూ టీడీపీ, టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం కూటమి ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆ నేపథ్యంలో డీజీపీని విధుల నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం అప్పట్లో ఆదేశాలు ఇచ్చింది. ఆయన స్థానంలో మహంతిని డీజీపీగా నియమించింది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ డీజీపీపై వేటు వేయడం ప్రజాస్వామ్య విజయమంటూ అప్పట్లో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు హర్షం వెలిబుచ్చారు. అప్పట్లో సీపీఐతోపాటు పలు పార్టీలు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను స్వాగతించాయి. విశేషం ఏమిటంటే అప్పట్లో రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ డీజీపీగా ఎస్‌ఎస్‌పీ యాదవ్‌నే కొనసాగించేలా ఎటువంటి వత్తిడి తేకపోవడం. 

ఇప్పుడు జరుగుతున్నదేమిటంటే..
రాష్ట్రంలో డీజీపీ ఠాకుర్, ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శాంతిభద్రతల సమన్వయ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, ఇంటెలిజెన్స్‌ ఓఎస్‌డీ యోగానంద్‌ రాష్ట్రంలో టీడీపీ కోసం పనిచేస్తున్నారని, ఇలా అయితే ఎన్నికలు నిష్పక్షపాతంగానూ, స్వేచ్ఛగానూ జరిగే అవకాశం లేదని ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పలుమార్లు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో వాస్తవాలను ఆరా తీసిన ఈసీ పలు కారణాలపై ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, కడప ఎస్పీలు వెంకటరత్నం, రాహుల్‌దేవ్‌శర్మను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ అదేశాలు ఇచ్చింది. దీంతో ఇదంతా ప్రధాని మోదీ, ప్రతిపక్షాల కుట్ర అంటూ చంద్రబాబు మంగళవారం ఉదయం నుంచి పలు కార్యక్రమాల్లో గగ్గోలు పెట్టారు. ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయాన్ని సైతం సవాలు చేసేలా ఆయన పార్టీ కేడర్‌ను రెచ్చగొట్టడం వివాదాస్పమైంది.  

నిబంధనలకు  విరుద్ధంగా సీఎం సమీక్షలు 
తన రాజకీయ ప్రయోజనాలు ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుతో ముడిపడి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల నిబంధలను బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏబీవీపై ఎన్నికల సంఘం వేటు వేయడంతో కంగారు పడిన సీఎం చంద్రబాబు సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం పలుమార్లు డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర కీలక అధికారులతో దఫదఫాలుగా చర్చలు జరిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కీలక అధికారులను ఇంటికి పిలిపించుకోవడం ఒక తప్పిదం అయితే ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయంపై సీఎం సమీక్ష జరపడం మరో తప్పు అని సీనియర్‌ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరెమనుకున్నా.. నిబంధనలు ఎలా ఉన్నా.. అడ్డగోలుగా తనకు తోచిందే చేస్తున్న చంద్రబాబు తీరు వల్ల తాము ఇరకాటంలో పడుతున్నామంటూ ఓ సీనియర్‌ అధికారి వాపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement