చెక్‌పోస్టులపై ఏసీబీ దాడులు
- లెక్కకు మించిన రూ.44,690 స్వాధీనం
- విచారణ అనంతరం చర్యలు : ఏసీబీ డీఎస్పీ
పలమనేరు : పలమనేరు సమీపంలోని చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిలో ఉన్న పలు చెక్‌పోస్టులపై తిరుపతి అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం దాడులు చేశారు. లెక్కకు మించి అనధికారికంగా దొరికిన రూ.44,690 నగదును సీజ్ చేశారు. పట్టణ సమీపంలోని కేటిల్‌ఫామ్ వద్ద ఆర్‌టీవో, వాణిజ్య పన్నులశాఖ, అటవీశాఖ, ఎక్సైజ్, సివిల్ సప్లయిస్ చెక్‌పోస్టులు పక్కపక్కనే ఉన్నాయి. వీటిల్లో బిల్లులకు చెల్లించాల్సిన నగదుతో పాటు అధికంగా డబ్బు వసూలు చేస్తున్నారని పలువురు డ్రైవర్లు ఏసీబీకి సమాచారమిచ్చారు. దీంతో తిరుపతి ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి, సీఐలు చంద్రశేఖర్, సుధాకర్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, శ్రీనివాస్, జావెద్‌ఖాన్ సిబ్బంది కలసి మంగళవారం దాడులు చేశారు. తొలుత కమర్షియల్ టాక్స్ చెక్‌పోస్టులో లెక్కకు మించిన రూ.21,600ను సీజ్ చేశారు.
అక్కడ పనిచేసే ఈ ప్రైవేట్ ఏజెంట్‌ను బాధ్యునిగా చూపారు. పక్కనే ఉన్న ఫారెస్ట్ స్పెషల్ చెక్‌పోస్టులో రూ.19,960ని స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ స్థానిక ఎఫ్‌ఆర్వో శివన్న సైతం ఉన్నా రు. ఈ చెక్‌పోస్టును ఎర్రచందనం అక్రమరవాణా కోసం ఏర్పాటు చేసినా అన్ని వాహ నాల నుంచి డబ్బు గుంజుతున్నట్టు ఏసీబీ తెలుసుకుంది. మరో పక్కనున్న ఆర్‌టీవో చెక్‌పోస్టులో రూ.3,130 మాత్రమే దొరికింది. మొత్తం కలిపి రూ.44,690లను సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి పలువురి వద్ద స్టేట్‌మెంట్లు రికార్డు చేసుకున్నారు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ శంకర్ రెడ్డి తెలిపారు. ఏసీబీ దాడులు చేస్తుండగా చెక్‌పోస్టుల్లోని పలువురు ప్రయివేటు ఏజెంట్లు పారిపోయినట్లు తెలిసింది.