అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు తనిఖీ
రూ.63 వేల అక్రమ వసూళ్లను గుర్తించిన అధికారులు
గరికపాడు (జగ్గయ్యపేట) : మండలంలోని గరికపాడు ఆర్టీఏ చెక్‌పోస్టులో అవినీతి నిరోధక శాఖాధికారులు గురువారం అర్ధరాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఏసీపీ డీఎస్పీ బి.గోపాలకృష్ణ ఆధ్వర్యంలో రాత్రి 12 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు కార్యాలయంలోని రికార్డులు, కంప్యూటర్‌లోని సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ చెక్‌పోస్టు వద్ద వాహనాల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని అక్రమ మార్గంలో వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీంతో చెక్‌పోస్టుపై దాడులు నిర్వహించామన్నారు.
తనిఖీ సమయంలో వాహనాల ట్యాక్స్, పర్మిట్ల రూపంలో ప్రభుత్వానికి రూ.లక్ష రావాల్సి ఉండగా అదనంగా రూ.63వేలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ నగదు అనధికారికంగా వాహనాల నుంచి వసూళ్లు చేసినట్లు తెలిసిందన్నారు. అంతేకాకుండా చెక్‌పోస్టులో ఒక ఇన్‌చార్జి, ఆరుగురు ఎంవీఐలతో పాటు ఆరుగురు సిబ్బంది ఉండాలన్నారు. ఉద యం సమయంలో ప్రైవేట్ వ్యక్తులు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసిందన్నారు.
తనిఖీ సమయంలో చెక్‌పోస్టులో మోటార్ వెహికల్ ఇన్‌స్పెస్పెక్టర్లు సురేష్, నాయుడులు విధుల్లో ఉన్నారన్నారు. అనధికారికంగా గుర్తించిన సొమ్మును సీజ్ చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్నారు. జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాల్లో అవినీతి అధికారులు ఉన్నట్లు తెలిసిందని వారిపై కూడా దాడులు చేస్తామని హెచ్చరించారు. దాడుల్లో సీఐ నాగరాజు, ఎస్‌ఐలు శ్రీనివాస్, వెంకటేశ్వరరావులు ఉన్నారు.
ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు
Published Sat, May 30 2015 4:18 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement