ఇద్దరు అధికారులపై ఏసీబీ దాడులు
ఒక్కొక్కరికి రూ.50 కోట్లకుపైగా అక్రమాస్తులు!
సాక్షి, అమరావతి/తిరుపతి క్రైం: రాష్ట్రంలో రెండు కీలక శాఖలకు చెందిన ఇద్దరు ప్రభుత్వ అధికారులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాలపై ఈ సోదాలు నిర్వహించినట్టు ఏసీబీ డీజీ ఆర్‌పీ ఠాకూర్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ (గుంటూరు) అసిస్టెంట్ సెక్రటరీ మందపాటి బాలకుటుంబరావు ఆస్తుల లెక్కలు తేల్చేందుకు మూడు ప్రాంతాల్లోను, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) ప్రణాళిక విభాగం అధికారి కె.కృష్ణారెడ్డికి చెందిన 8 ప్రాంతాల్లోను ఏసీబీ ప్రత్యేక బృందాలు తనిఖీలు జరిపాయి.
ఏసీబీకి చిక్కిన బాలకుటుంబరావు ఆస్తులు అప్పట్లో రూ.1.20 కోట్లు అని పేర్కొంటున్నప్పటికీ వాటి విలువ రూ.50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అలాగే కృష్ణారెడ్డి ఆస్తులు అప్పట్లో మార్కెట్ విలువను బట్టి రూ.2 కోట్లుగా చెబుతున్నప్పటికీ వాటి విలువ దాదాపు రూ.60 కోట్లు పైమాటేనని అంటున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో బాలకుటుంబరావు, కృష్ణారెడ్డిలను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని ఏసీబీ డీజీ ఠాకూర్ తెలిపారు.