ఓ కాంట్రాక్టు లెక్చరర్ వద్ద లంచం తీసుకుంటూ మంగళవారం టీటీడీ లెక్చరర్ ఏసీబీకి పట్టుబడ్డారు.
తిరుపతి క్రైం: ఓ కాంట్రాక్టు లెక్చరర్ వద్ద లంచం తీసుకుంటూ మంగళవారం టీటీడీ లెక్చరర్ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తిరుపతిలోని ఎస్‌జీఎస్ డిగ్రీ కళాశాలలో పెద్ద రెడ్డెప్పరెడ్డి కంప్యూటర్ సైన్స్(ఎమ్మెస్సీ) విభాగాధిపతి(హెచ్‌ఓడీ)గా పనిచేస్తున్నారు. అక్కడే కాంట్రాక్టు లెక్చరర్గా బాలాజీ పనిచేస్తున్నారు. ఈ క్రమంలో బాలాజీ 2014-15కు సంబంధించిన జీతాల ఫైల్‌ను హెచ్‌ఓడీకి అందించారు. 8 నెలలకు కలిపి మొత్తం రూ.81వేలు రావాల్సి ఉంది. ఈ డబ్బు రావాలంటే హెచ్‌ఓడీ ఆ ఫైల్‌పై సంతకం పెట్టి టీటీడీ జేఈవోకు పంపిస్తారు. అక్కడ నుంచి అకౌంట్స్ సెక్షన్‌కు చేరుతుంది. అక్కడ ఆమోదం పొంది తిరిగి కాలేజీ ప్రిన్సిపాల్‌కు చేరాలి.
అయితే ఆ ఫైల్ పంపించాలంటే రూ.40 వేలు చెల్లించాలని పెద్దరెడ్డెప్పరెడ్డి డిమాండ్ చేశారు. బాలాజీ ఎంత బతిమాలినా కూడా తగ్గించుకోలేదు. చివరకు రూ.31 వేలు చెల్లిస్తానని చెప్పాడు. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్డెప్పరెడ్డిని అరెస్టు చేశారు. అతని వద్ద రూ.31 వేలు స్వాధీనం చేసుకుని నెల్లూరు కోర్టుకు తరలించారు.