ఎక్సైజ్ సీఐ ఇంట్లో ఏసీబీ సోదాలు
Published Wed, Feb 5 2014 1:44 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
బాదంపూడి(ఉంగుటూరు), న్యూస్‌లైన్ : బాదంపూడిలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కృష్ణాజిల్లా ఉయ్యూరులో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐగా పనిచేస్తున్న యామల జయరాజు ఆదాయూనికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని సమాచారం మేరకు స్వగ్రామం బాదంపూడిలో ఆయన సోదరుడు, బంధువుల ఇళ్లలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు సుమారు 14 గంటల పాటు అధికారులు సోదాలు చేశారు. వీఆర్వో నరేంద్రకుమార్ కార్యాలయూనికి వెళ్లి రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. జయరాజు పూర్వం ఆస్తులు, కొత్తగా కొనుగోలు వాటిని క్షుణ్ణంగా పరిశీలన చేశారు. సోదరుడు ఇంటిలో ఉన్న దస్తావేజులను చూసి వెల్లమిల్లి ఉన్న పొలాలు బాదంపూడిలో ఉన్న గెస్ట్‌హౌస్‌ను ఏసీబీ రాజమండ్రి డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు పరిశీలించారు.
ఏసీబీ సీఐలు బి.శ్రీనివాస్(విజయవాడ), కె.సీతారామయ్య(విజయవాడ), కొమ్మరయ్య(ఏలూరు), పలువురు సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు. ఏకకాలంలో ఉయ్యూరు, బాదంపూడి, రాజమండ్రి, హైదరాబాద్‌లో ఉంటున్న జయరాజు, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో దాడులు చేస్తున్నాయని డీఎస్పీ వెంకటేశ్వరరావు చెప్పారు. వివరాలపై ‘న్యూస్‌లైన్’ డీఎస్పీని ప్రశ్నించగా నాలుగు చోట్ల చేసిన దాడుల వివరాలను రాజమండ్రిలో వెల్లడిస్తామని చెప్పారు.
హడలిపోతున్న అధికారులు మండలంలో ఏసీబీ అధికారులు దాడులు చేయటంతో అధికారులు హడలిపోతున్నారు. ఏ క్షణంలో ఏ అధికారిపై దాడులు జరుగుతాయోనని బెంబేలెత్తిపోతున్నారు. ఏసీబీ సోదాలపై గ్రామంలో చర్చించుకుంటున్నారు.
Advertisement
Advertisement