ఏసీబీకి చిక్కిన సీఐ కే శ్రీనివాసరావు, కానిస్టేబుల్ శేషు
లక్ష్మీపురం(గుంటూరు): నగర శివారులో ఉన్న నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో సీఐ కె.శ్రీనివాసరావు, కానిస్టేబుల్ శేషులు రూ.30 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ కె.శాంతో తెలిపిన వివరాల ప్రకారం.. సునీత, వెంకటేష్ దంపతులు నకిలీ స్టాంపులు తయారు చేస్తున్నారని, చోలమండల్ ఫైనాన్స్ ఎన్‌ఓసీలు ఇస్తున్నారని 2017 నవంబరు తొమ్మిదిన జిల్లా రవాణా శాఖ అధికారి రాజారత్నం నల్లపాడు పోలీసు స్టేషన్‌లో సీఐకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో సీఐ అసలు నిందితులపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా కేసుకు సంబంధం లేని నరసరావుపేటకు చెందిన షేక్ ఎం.డి.కలీం, నాగరాజు, కరీముల్లా, రబ్బాని, పెన్నింటి రజిని, కసుకుర్తి రాజశేఖర్‌లపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నరసరావుపేట ప్రాంతానికి చెందిన నిఖిల్ ప్రింటర్స్ యజమాని కసుకుర్తి రాజశేఖర్ అనే వ్యక్తిని కూడా కేసులో పెట్టారు.
కసుకుర్తి రాజశేఖర్ చోరమండల్ ఫైనాన్స్‌కు సంబంధించిన నకిలీ స్టాంపులు తయారు చేసినట్లు దర్యాప్తులో తేలిందని నల్లపాడు పోలీసు స్టేషన్ నుంచి శేషు అనే కానిస్టేబుల్ ఫోన్ చేసి సమాచారం తెలిపాడు. ఆ సమయంలో వైజాగ్‌లో ఉన్న కసుకుర్తి రాజశేఖర్ ఈ నెల 9వ తేదీన నల్లపాడు స్టేషన్‌కు వచ్చి ఈ కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొనేందుకు ప్రయత్నం చేసినా సీఐ కె.శ్రీనివాసరావు పట్టించుకోలేదు. నకిలీ స్టాంపులు తయారు చేసిన కేసులో ముద్దాయి ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేస్తున్నామని, ఈ కేసు నుంచి బయటపడాలంటే రూ.లక్ష ఇవ్వాలని సీఐ శ్రీనివాసరావు అతన్ని డిమాండ్ చేశాడు. దీంతో తనకు కేసుతో సంబంధం లేదని, కొంత సమయం ఇవ్వాలని రాజశేఖర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదే నెల 15న షేక్ అహ్మద్ కరీం అనే వ్యక్తిని నల్లపాడు పోలీసులు జీపులో ఎక్కించుకుని నరసరావుపేటలోని కసుకుర్తి రాజశేఖర్ వద్దకు వెళ్లారు.
అతని ప్రింటింగ్ షాపులో ఉన్న ప్రింటింగ్ మిషనరీ, సామగ్రిని సీజ్ చేసి నోటీసు ఇచ్చి వెళ్లారు. మరుసటి రోజు రాజశేఖర్‌కు కానిస్టేబుల్ శేషు ఫోన్ చేసి రూ.లక్ష ఇవ్వని పక్షంలో నిందితుడిలా జైలుకు వెళ్లాల్సి వస్తుందని బెదిరించాడు. మరలా రాజశేఖర్ స్టేషన్‌కు వెళ్లి సీఐని బతిమాలుకోగా రూ.30 వేలకు బేరం కుదిర్చారు. ఈ క్రమంలో దిక్కుతోచని స్థితిలో రాజశేఖర్ ఈ నెల 21న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. జరిగిన సంఘటనపై అధికారులకు తెలిపాడు. దీంతో గురువారం ఏసీబీ డీఎస్పీ శాంతో, సీఐ సురేష్, నల్లపాడు సీఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ శేషు రూ.30 వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసుపై దర్యాప్తు చేస్తున్నామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ శ్రీనివాసరావు నివాసంపై తనిఖీలు నిర్వహిస్తామని అధికారులు చెప్పారు.
ఫిర్యాది ఆవేదన
నకిలీ స్టాంపులు తయారు చేశాడంటూ తనపై లేనిపోని ఆరోపణలు చేసి ఇబ్బంది పెట్టారని బాధితుడు కసుకుర్తి రాజశేఖర్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. సీఐ శ్రీనివాసరావు రూ.లక్ష ఇస్తే గానీ కేసులో నుంచి తీసేస్తామని బెదిరించారని, చోరమండల్ స్టాంప్‌లు లాంటి నకిలీ స్టాంపులు తయారు చేసిన దాఖలాలు లేవని కన్నీంటి పర్యంతమయ్యాడు. అసలు నిందితులు ఎవరనేది కూడా తెలియకుండా కేసులు నమోదు చేయడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏసీబీ అధికారులకు కానిస్టేబుల్ శేషు ఫోన్‌లో మాట్లాడిన సంభాషణ రికార్డింగ్ కూడా వినిపించాడు. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన ఈ నెల 21న, గురువారం ఉదయం కూడా కానిస్టేబుల్ శేషు రూ.30 వేలు తీసుకురావాలని, లేని పక్షంలో జైలు పాలవుతావని బెదిరించాడు. అమాయకుడైన తనపై తప్పుడు కేసు నమోదు చేసిన సీఐ, కానిస్టేబుల్‌పై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment