కంచె చేను మేసింది | CI Corruption Revealed With ACB Rides | Sakshi
Sakshi News home page

కంచె చేను మేసింది

Published Sat, Feb 24 2018 9:34 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

CI Corruption Revealed With ACB Rides - Sakshi

లంచం తీసుకుంటూ పట్టుబడిన నల్లపాడు సీఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్‌ శేషులను విచారిస్తున్న ఏసీబీ డీఎస్పీ దేవానంద్‌ శాంతో, సీఐ ఫిరోజ్‌ (ఫైల్‌)

సాక్షి, గుంటూరు: చట్టంలోని లొసుగులను కొందరు అవినీతి పోలీసు అధికారులు అనుకూలంగా మలుచుకుంటున్నారు. నల్లపాడు పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన ఓ కేసు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది. సాక్షాత్తు జిల్లాస్థాయి అధికారి ఇద్దరు వ్యక్తులపై చేసిన ఫిర్యాదును పట్టించుకోకుండా వారిని కేసు నుంచి తప్పించేశారు. లక్షల్లో వారి నుంచి డబ్బులు గుంజినట్లు సమాచారం. ఏడుగురిని నిందితులుగా చేరుస్తూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేశారు. బేరం కుదరని ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. మరో నలుగురి నుంచి సుమారు రూ. 2 లక్షలు వసూలు చేసి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేశారు. ఆరో ముద్దాయిగా ఉన్న వ్యక్తి నుంచి రూ. లక్ష వసూలు టార్గెట్‌గా పెట్టుకుని రూ. 30వేలకు బేరం కుదుర్చుకున్నారు. డబ్బులు తీసుకునే సమయంలో ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. బాధితుడు ఏసీబీ అధికారుల ముందు ఉన్న సమయంలో సైతం డబ్బులు తీసుకు రావాలంటూ కానిస్టేబుల్, సీఐ నుంచి ఫోన్‌లు రావడం గమనార్హం. అసలు నిందితులను తప్పించి చిన్న, చితకా ప్రమేయం ఉన్నవారిపై కేసు నమోదు చేయడంపై ఏసీబీ అధికారులు పూర్తి విచారణ జరుపుతున్నారు. డబ్బులు తీసుకుంటూ నేరుగా దొరికిన నల్లపాడు సీఐ కుంకా శ్రీనివాసరావు, కానిస్టేబుల్‌ శేషగిరిరావు (శేషు)లను విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు.

బండారం బయట పడింది ఇలా...
గుంటూరుకు చెందిన సునీత, వెంకటేష్‌ దంపతులు చోళమండల్‌ ఫైనాన్స్‌లో ఓకారును కొనుగోలు చేశారు. అయితే, వారికి డబ్బులు చెల్లించకుండానే డబ్బు మొత్తం చెల్లించినట్లుగా నకిలీ ఎన్‌ఓసీ పుట్టించి దాని ద్వారా వేరొకరికి విక్రయించేందుకు గుంటూరు రవాణా శాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌  కోసం దరఖాస్తు చేశారు. విషయం తెలుసుకున్న చోళమండల్‌ ఫైనాన్స్‌ నిర్వాహకులు డీటీసీ రాజారత్నంకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన రవాణా శాఖ అధికారులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో తమను మోసగించేందుకు యత్నించారంటూ సునీత, వెంకటేష్‌ దంపతులపై 2017 నవంబరులో నల్లపాడు పోలీసులకు డీటీసీ రాజారత్నం స్వయంగా ఫిర్యాదు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. కేసును దర్యాప్తు చేసిన నల్లపాడు సీఐ కుంకా శ్రీనివాసరావు అసలు నిందితులైన సునీత, వెంకటేష్‌లను కేసు నుంచి తప్పించి వారికి సహకరించిన ఏడుగురిపై కేసు నమోదు చేశారని రవాణా శాఖ అధికారులు ఆరోపణ. కేసు నుంచి తప్పించినందుకు వీరి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. అంతేకాకుండా కేసు నమోదు చేసిన ఏడుగురిలో షేక్‌ అహ్మద్‌ కరీమ్, కె.నాగరాజులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన పోలీసులు కరీముల్లా, రబ్బాని, రజని, దరియావలీల నుంచి సుమారు రూ. 2 లక్షలు వసూలు చేసి వారికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపినట్లు ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. తనకు ఫోన్‌ చేసి స్టేషన్‌కు పిలిపించిన కానిస్టేబుల్‌ శేషు రూ. లక్ష ఇస్తే స్టేషన్‌ బెయిల్‌ ఇస్తామని, లేదంటే జైలుకు పంపుతామంటూ బెదిరించినట్లు కేసులో ఆరో ముద్దాయిగా ఉన్న రాజశేఖర్‌ చెప్పారు. ఆత్మహత్య చేసుకుంటా నన్నా పట్టించుకోకుండా డబ్బులు డిమాండ్‌ చేశారని, దీంతో చేసేది లేక రూ. 30వేలకు బేరం కుదుర్చుకున్నానని, కొంత సమయం ఇవ్వాలని కోరినా తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంతో తట్టుకోలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు చెప్పారు.

రవాణాశాఖ అధికారుల్లో ఆగ్రహం
గతంలో కూడా రవాణా శాఖ అధికారులు ఓ నిందితుడ్ని పట్టుకుని నల్లపాడు పోలీసులకు అప్పగించగా, తమ సిబ్బంది పైనే ఎదురు కేసులు పెట్టారని, ప్రస్తుతం తాము ఇచ్చిన ఫిర్యాదులోని నిందితులను వదిలేసి, ఎవరెవరినో కేసులో ఇరికించారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలు నిందితులను ఎందుకు వదిలేశారో ?
చోళమండల్‌ ఫైనాన్స్‌లో లోను తీసుకుని కారు కొనుగోలు చేసిన మేడిపల్లి సునీత, వెంకటేష్‌ దంపతులు వారికి డబ్బు చెల్లించకుండా నకిలీ ఎన్‌ఓసీ సృష్టించి వేరొకరికి రిజిస్ట్రేషన్‌ చేసేందుకు మా కార్యాలయంలో దరఖాస్తు చేశారు. దీన్ని గుర్తించిన సిబ్బంది విషయాన్ని నా దృష్టికి తీసుకు రావడంతో రిజిస్ట్రేషన్‌ నిలిపివేసి వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలంటూ నల్లపాడు సీఐ కుంకా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశాను. అయితే, వీరిద్దరి ప్రమేయం లేదని సీఐ నాతో చెప్పడంతో విస్తుపోయాను.     – రాజారత్నం, డీటీసీ

లంచం తీసుకుంటూ పట్టుబడిన నల్లపాడు సీఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్‌ శేషులను విచారిస్తున్న ఏసీబీ డీఎస్పీ దేవానంద్‌ శాంతో, సీఐ ఫిరోజ్‌ (ఫైల్‌)
(ఇన్‌సెట్‌) ఏసీబీకి  ఫిర్యాదు చేసిన  రాజశేఖర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement