లంచం తీసుకుంటూ పట్టుబడిన సీఐ
విజయనగరం: రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి లంచం తీసుకుంటూ ఓపోలీసు అధికారి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. విజయనగరం వన్ టౌన్ సీఐ శోభన్ బాబు ఏసీబీ అధికారులకు చిక్కారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని తోటపాలెంకు చెందిన రియల్టర్ యెర్రా ఈశ్వరరావును ఒక హోంగార్డు, ఏపీఏస్పీ కానిస్టేబుల్ కిడ్నాప్ చేసి మరో రియల్టర్‌కు అప్పగించారు. తనను బంధించి మరో రియల్టర్ శ్రీనివాస్ పోలీసుల సాయంతో అతని ఆస్తులను బలవంతంగా రాయించుకున్నట్లు బాధితుడు ఈశ్వరరావు సీఐ శోభన్‌బాబుకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఆస్తులను తిరిగి అప్పగించాలంటే రూ.5లక్షలు లంచం ఇవ్వాలని శోభన్‌బాబు డిమాండ్ చేశారు. అందులో భాగంగా ఈశ్వరరావు రూ.2 లక్షలు ముట్టజెప్పారు.
మిగిలిన రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చెయ్యడంతో ఇచ్చేందుకు ఈశ్వరరావు పిల్లలు అంగీకరించలేదు. నష్టపోయిన తమకు న్యాయం చెయ్యాల్సిన పోలీసులు లంచం అడగడంతో ఆగ్రహం చెందిన వారు ఏసీబీ డీజీ ఠాకూర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఏసీబీ సెంట్రల్ టీంను ఆదేశించగా డీఎస్పీ ప్రసాద్ నేతృత్వంలో సీఐ శోభన్‌బాబు కార్యాలయంపై దాడి చేసి మధ్యవర్తి రెహ్మాన్ రూ.3 లక్షలు ఇస్తుండగా పట్టుకున్నారు. అంతకుముందు ఈశ్వరరావు కిడ్నాప్ కేసులో నిందితులైన హోంగార్డులు బర్లే శ్రీనివాస్, లక్ష్మణ్‌లను సీఐ శోభన్ బాబు అరెస్టు చెయ్యగా అదే కేసులో సీఐ నిందితుడు కావడం విశేషం.