* సమైక్యాంధ్రప్రదేశ్ కోసం చివరిదాకా పోరాడుతాం: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
* మొన్నటిదాకా సమైక్యమన్న కేంద్ర మంత్రులంతా ఇవాళ ప్యాకేజీలంటూ మాట్లాడుతున్నారు
* సోనియాగాంధీ చెప్పినట్లు కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు ఆడుతున్నారు
* సమైక్యానికి అనుకూలంగా ఉన్నది వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం మాత్రమే
* ఇప్పటికైనా చంద్రబాబు, కిరణ్‌లు కలిసిరావాలి.. చరిత్రహీనులుగా మిగిలిపోవద్దు
* ఇప్పటికీ కళ్లు తెరవకుంటే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఎడారే
* విభజన ముసాయిదా బిల్లు అసెంబ్లీకి రాకముందే సమైక్య తీర్మానం చేయాలి
* ఈ నెల 26న హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం సభ నిర్వహిస్తున్నాం
* ఈ వ్యవస్థలో నిజాయితీని తీసుకురావడానికి రాజకీయాలను పక్కన పెట్టి అందరూ కలిసిరావాలి
* సమైక్య రాష్ట్రం కోసం ఉద్యోగులు సహా అందరినీ ఈ సభకు ఆహ్వానిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించరాదని, సమైక్యంగా ఉంచాలన్న గట్టి నినాదంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చడానికి అన్ని రకాల ప్రయత్నాలూ జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసేందుకు శాసనసభను వెంటనే సమావేశపరిచేలా చూడాలని కోరుతూ గురువారం మరోసారి రాష్ట్ర గవర్నర్‌ను కలిసి విన్నవించిన అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి లోటస్‌పాండ్‌లోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
‘‘కనీసం ఇప్పటికైనా రాష్ట్ర అసెంబ్లీకి ముసాయిదా బిల్లు రాకముందే సమైక్య రాష్ట్రం కోసం తీర్మానం చేయాలని మళ్లీ అడుగుతున్నాం. ఇవాళ కొందరు ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి విభజించాలని ఏకంగా నిరాహార దీక్ష చేస్తారు. ఆ నెపంతో ఆయన ఎంతమందిని కలిశారో, ఎవరిని కలిశారో నాకైతే తెలియదుకానీ.. రాష్ట్రాన్ని విభజించాలని నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత వెనువెంటనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇక్కడ ఉద్యోగ సంఘాల వారందరినీ ఒక్కొక్కరినీ పిలుచుకుని వారిని భయపెట్టి ఉద్యమబాట నుంచి తప్పుకొనేలా చేస్తున్నారు. అంతటితో సరిపోదన్నట్లుగా సమైక్యానికి కట్టుబడి ఉన్నామని మొన్నటిదాకా చెప్పిన కేంద్ర మంత్రులంతా ఇవాళ సమైక్యాన్ని పక్కనపెట్టి ప్యాకేజీలు కావాలన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. నిజంగా వీళ్ల తీరు చూస్తుంటే అసలు మనుషులేనా అని అనిపిస్తోంది’’ అంటూ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోనియా చెప్పినట్లు చేస్తున్నారు..
‘‘సోనియాగాంధీ గారేమో తన కొడుకును ప్రధానమంత్రిని చేయాలని చెప్పి, ఇక్కడ మా అందరి జీవితాలు, మా పిల్లలందరి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. సోనియాగాంధీకి తగుదునమ్మా అన్నట్లుగా చంద్రబాబు అడ్డగోలుగా విభజన చేయడానికి మద్దతిస్తున్నారు. ఇక కిరణ్‌కుమార్‌రెడ్డి అయితే సోనియా గీత గీస్తే ఒక్క అడుగు కూడా పక్కకువేయకుండా తు.చ. తప్పకుండా పాటిస్తూ మద్దతునిస్తున్నారు. ఇప్పటికైనా చరిత్రహీనులుగా మిగిలిపోవద్దని వీరందరినీ హెచ్చరించారు. సమైక్యానికి అనుకూలంగా ఉన్నది వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం.. ఈ మూడు పార్టీలు మాత్రమే. చంద్రబాబు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని మూడు పార్టీల వైపునకు రమ్మని చెబుతున్నాం. మూడు పార్టీలు కాస్తా నాలుగు పార్టీలు కావాలి. నాలుగు తర్వాత అయిదు పార్టీలు కావాలి. అందరమూ ఒక్కటైతేనే ఇది సాధ్యపడుతుంది. విభజన ఆగుతుంది’’ అని జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
‘‘చంద్రబాబు, కిరణ్‌కు ఒక్కటే చెప్పదల్చుకున్నా ఇద్దరూ కూడా చరిత్రహీనులుగా మిగిలిపోవద్దు. కనీసం ఇప్పటికైనా కళ్లు తెరవండి. కళ్లు తెరవకపోతే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా రాష్ట్రం ఎడారి అవుతుందన్న సంగతి మర్చిపోవద్దు. చదువుకున్న ప్రతి పేద పిల్లవాడు కూడా ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చినపుడు, ఆ హైదరాబాద్‌లో తనను పక్కనబెట్టినపుడు.. చంద్రబాబు, కిరణ్‌ను తిట్టుకునే పరిస్థితి వస్తుందని మర్చిపోవద్దు. ఇప్పటికైనా వీళ్లు కళ్లు తెరవాలి. అసెంబ్లీని వెంటనే సమావేశపర్చాలి. సమైక్యానికి అనుకూలంగా తీర్మానం చేయాలని వీరిద్దరినీ గట్టిగా డిమాండ్ చేస్తున్నా...’’ అని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
సమైక్యమంటే మూడు ప్రాంతాలూ...
గతంలో కూడా గవర్నర్‌ను కలిసి అసెంబ్లీని సమావేశపర్చాలని వినతిపత్రం ఇచ్చామని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రికి కూడా ఇదే విషయమై లేఖల మీద లేఖలు రాశామన్నారు. ‘‘కేబినెట్ నోట్ రావడానికి ముందే రాష్ట్ర శాసనసభను సమావేశపరచి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని కోరాం. కానీ మేం చేసిన వినతి అరణ్యరోదనగానే మిగిలి పోయింది. ఆ తరువాత కేంద్రం ఓ అడుగు ముందుకు వేసింది. అందుకే మళ్లీ చెబుతున్నా... ముసాయిదా బిల్లు అసెంబ్లీకి రాకముందే ఇప్పటికైనా సమైక్య తీర్మానం చేయాలి’’ అని ఆయన కోరారు.
ఈ నెల 26న హైదరాబాద్‌లో సభ జరుపుకోవడానికి పోలీసులు అనుమతినిచ్చారని, ఆ రోజున సమైక్య శంఖారావాన్ని పూరిస్తామని తెలిపారు. ‘‘సమైక్యం అంటే మళ్లీ మళ్లీ చెబుతున్నా.. సమైక్యం అంటే అందులో తెలంగాణ ఉంటుంది.. కోస్తాంధ్ర ఉంటుంది.. రాయలసీమ ఉంటుంది. అన్ని ప్రాంతాలనూ సమైక్యంగా ఉంచాలనేదే నా అభిమతం. ఈ మూడు ప్రాంతాలకూ న్యాయం చేస్తానని స్పష్టంగా చెబుతున్నా.. సమైక్యం అంటే మూడు ప్రాంతాలనూ కలిపి ఉంచాలి. మూడు ప్రాంతాలకు న్యాయం జరిగేలా నేను ముందుంటానని చెప్పడానికే ఈ సమైక్య శంఖారావం నిర్వహిస్తున్నాం. ఇవాళ అందరితో కూడా నేను ఒకటే విన్నపం మళ్లీ మళ్లీ చేస్తున్నాను. రాజకీయాలను పక్కన పెట్టండి. ఈ వ్యవస్థలో నిజాయితీని తీసుకురండి. అందరూ ఒక్కటి కవాల్సిన అవసరాన్ని పక్కనబెడితే మాత్రం చరిత్రహీనులుగా మిగిలి పోయే పరిస్థితి వస్తుంది. అందుకే చంద్రబాబు, కిరణ్‌లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా.. అయ్యా చరిత్రహీనులుగా మిగిలిపోకండి, రండి.. కలిసిరండి అని విజ్ఞప్తి చేస్తున్నా...’’ అని అన్నారు.
చివరిదాకా పోరాడుతాం..
సమైక్యాంధ్ర ఉద్యమం తగ్గిపోయిందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా...‘‘మా ఖర్మ ఏంటంటే.. దిగ్విజయ్, సోనియాగాంధీ గారికి కుడి భుజమో.. ఎడమ భుజమో అర్థం కావడం లేదు కానీ ఆయన కుడి భుజం అయితే కిరణ్ ఆమెకు ఎడమ భుజం లాంటి వారు.. దిగ్విజయ్ ఉద్యమం తగ్గిపోయిందంటారు.. కిరణ్ దగ్గరుండి ఉద్యమబాట నుంచి ఒక్కొక్కరినీ తప్పించే కార్యక్రమం చేస్తారు.. విభజించండి అని చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఏజెంట్‌గా ఏకంగా నిరాహారదీక్షలే చేస్తారు. నిజంగా ఇది మన ఖర్మ. అయినాగానీ నేనొక్కటైతే చెబుతాను. వీళ్లంతా మనుషులే! పైన దేవుడున్నాడు, కచ్చితంగా మేం మాత్రం ఉద్యమబాటను తీవ్రతరం చేస్తాం. చివరిదాకా పోరాటం గట్టిగా చేస్తాం’’ అని ఉద్ఘాటించారు.
కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ.. ‘‘న్యాయంగా మీరే గుండెల మీద చెయ్యేసుకుని అడగండి, ఎవరు నిజాయితీగా ఉన్నారో.. ఎవరు నిజాయితీగా లేరో? ఎవరు 16 నెలలు జైల్లో ఉన్నారు? బయట ఉండి రాజ్యసభలో ఎఫ్‌డీఐ ఓటింగ్ దగ్గర నుంచి ఏకంగా అసెంబ్లీలో విప్ జారీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడిందెవరో? మీ గుండెల మీద చెయ్యేసుకుని అడగండి. నేను లోపల ఉన్నా నిజాయితీగా రాజకీయాలు చేశాను. బయట ఉండి చంద్రబాబు చేసిందేమిటి కాంగ్రెస్‌ను కాపాడ్డం తప్ప’’ అని అన్నారు. సమైక్య శంఖారావం సభకు ఉద్యోగ సంఘాలను కూడా ఆహ్వానిస్తారా అని ప్రశ్నించినపుడు ‘‘ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నా.. ప్రతి ఒక్కరినీ మీడియా ముఖంగా ఆహ్వానిస్తున్నా.. సమైక్యమంటే అందరినీ కలవమనే చెబుతున్నా’’ అని అన్నారు.
విలేకరుల సమావేశంలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, మేకా శేషుబాబు, దేశాయి తిప్పారెడ్డి, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, బాలినేని శ్రీనివాసరెడ్డి, భూమా శోభానాగిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మాజీ ఎం.పి వి.బాలశౌరి, ఇతర నేతలు బి.జనక్‌ప్రసాద్, వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు.
అందరం రాజీనామాకు కట్టుబడి ఉన్నాం..
లోక్‌సభ సభ్యత్వానికి తాను చేసిన రాజీనామాతోపాటు తమ పార్టీ ఎంపీలందరూ చేసిన రాజీనామాలను కూడా ఆమోదింప జేసుకుంటారని, ఆ మేరకు స్పీకర్ మీరాకుమార్‌పై ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
‘‘నేనొక్కడినే కాదు, మా రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి, మా పార్టీలో ఎవరైతే ఉన్నారో వారు, మా పార్టీలో చేరబోతున్న వారు తమ రాజీనామాలను ఆమోదింపజేసుకుంటారు. నేను స్పీకర్‌కు మళ్లీ ఒక లేఖను రాశాను. మీకు కూడా విడుదల చేస్తాను. కోర్టు ఆంక్షల వల్ల నేను ఢిల్లీకి రాలేకపోయినా, దయచేసి నా రాజీనామాను ఆమోదించండి అని రాశాను. రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి ఇద్దరూ శుక్రవారం ఢిల్లీకి నా లేఖ తీసుకుని వెళుతున్నారు. మా రాజీనామాలు కచ్చితంగా ఆమోదించండి అని స్పీకర్‌పై ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేస్తూనే ఉంటాం’’ అని ఆయన వివరించారు.
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
Published Fri, Oct 18 2013 12:46 AM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM
Advertisement
Advertisement