
భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం
ఉప్పు రైతులతో కలెక్టర్ శ్రీకాంత్
ముత్తుకూరు : కృష్ణపట్నం పోర్టు విస్తరణ కోసం సేకరించే ఉప్పు భూములకు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ అన్నారు. గోపాలపురం వద్ద గురువారం ఉప్పు సాగు నిలిపివేసిన కేంద్రప్రభుత్వ భూములను పరిశీలించిన కలెక్టర్ అక్కడే ఉప్పు సాగు లీజుదారులతో మాట్లాడారు. కేంద్రప్రభుత్వానికి చెందిన 741 ఎకరాల్లో ఏళ్ల తరబడి 108 మంది లీజుదారులు ఉప్పు సాగు చేస్తున్నారు. ఇటీవల ఈ భూములను పోర్టు కోసం సేకరించాలన్న ప్రతిపాదన వచ్చింది. ఈ నేపథ్యంలో లీజుదారులు పరిహారం కోసం పలుమార్లు జిల్లా కలెక్టర్‌కు, పోర్టు నిర్వాహకులతోనూ తమ ఆవేదనను పంచుకున్నారు. ఉప్పు భూములకు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం లీజుదారులకు ఎంత పరిహారం ఇవ్వాలనే అంశాన్ని పరిశీలించాలని కలెక్టర్ ఈ సందర్భంగా నెల్లూరు ఆర్‌డీఓ సుబ్రహ్మణ్యేశ్వరెడ్డిని ఆదేశించారు. ఈ భూమికి బదులుగా సాల్ట్ కమిషన్ మరో చోట భూములు కోరుతోందంటూ రైతులు కలెక్టర్‌తో చెప్పారు. ఇందుకోసం కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం వద్ద భూములు పరిశీలించారని రైతులు చెప్పారు. ఈ కార్యక్రమంలో పోర్టు పీఆర్వో వేణుగోపాల్, సాల్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.
భూసేకరణ చట్టం, కృష్ణపట్నం, శ్రీకాంత్