గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో కళా, సాహిత్య, సాంస్కృతిక సృజనను వెలికితీస్తూ రెండు రోజుల పాటు నిర్వహించిన ‘చే’ యువ తరంగాలు శుక్రవారం ముగిశాయి. గుంటూరు వేదికగా ఈనెల 18వ తేదీ నుంచి జరగనున్న భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని, నగరంలోని సాంబశివపేట ప్రభుత్వ వృత్తివిద్య బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ముగింపు కార్యక్రమంలో కార్యక్రమ నిర్వహణ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యార్థులు మార్కులు, ర్యాంకులకే పరిమితం కాకుండా సృజనకు పదునుపెట్టి సమాజాన్ని మేలుకొల్పాలని సూచించారు. మాస్టర్‌మైండ్స్ డెరైక్టర్ మట్టుపల్లి మోహన్ మాట్లాడుతూ పాశ్చాత్య ధోరణికి అలవాటు పడిన యువతరాన్ని సంస్కృతి, సంప్రదాయాలవైపు మరల్చే విధంగా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ కోయి సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులు, విద్యారంగ పరిరక్షణ కోసం ఎస్‌ఎఫ్‌ఐ వినూత్న కార్యక్రమాలతో ముందుకెళ్తోందని ప్రశంసించారు.
న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన కావూరి సత్యనారాయణ, డాక్టర్ అబ్ధుల్ రజాక్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నూర్ మహ్మద్, ఆర్‌వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాల ఎన్‌సీసీ అధికారి మద్ధినేని సుధాకర్, కార్యక్రమాల నిర్వహణ సమన్వయకర్త డాక్టర్ ఎం.బోసుబాబు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు వి.భగవాన్‌దాస్, జగదీష్, ప్రసన్న, రవి, ఝాన్సీ, శ్రీవిద్య, నాగరాజు, క్రాంతి, ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి పి.వి.రమణ, డి.వి.రామారావు, డ్యాన్స్ మాస్టర్ రమేష్, సుశీల, టీఆర్ రమేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లలిత సంగీతం, బృందగానం, వక్తృత్వం, క్విజ్, మిమిక్రీ, ఏకపాత్రభినయం, లఘు నాటిక, చిత్రలేఖనం, శాస్త్రీయ నృత్యం, జానపద నృత్యం, రంగోలి విభాగాల్లో పోటీపడి ప్రథమ, ద్వితీయ, తృ తీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఉత్సాహ భరితం.. ఉత్తేజ పూరితం
Published Sat, Dec 13 2014 3:13 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement