కడపలో కొవ్వొత్తుల ర్యాలీ
పాలన, అధికార వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి వెలుగులు విరజిమ్ముతాయని పలువురు పేర్కొన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్రంలో పలుచోట్ల శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి. వికేంద్రీకరణకు మోకాలడ్డుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరును ప్రజలు నిరసించారు.
– సాక్షి నెట్‌వర్క్
మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ కడపలో నాలుగో రోజైన శుక్రవారం కూడా రిలే దీక్షలు కొనసాగాయి. సాయంత్రం కడప, ప్రొద్దుటూరులలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ప్రొద్దుటూరులో జరిగిన ప్రదర్శనలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పాల్గొన్నారు. రైల్వేకోడూరు, రాజంపేట, పులివెందుల పట్టణాల్లోనూ కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగాయి. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఎస్వీయూ పరిపాలన భవనం వద్ద విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. చిత్తూరులో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, సినీ దర్శకుడు ఆర్కేసెల్వమణి పాల్గొన్నారు. ఇదే జిల్లాలోని శ్రీరంగరాజపురం, పెనుమూరు, వెదరుకుప్పం, గంగాధర నెల్లూరు, పాలసముద్రం, పూతలపట్టులో విద్యార్థులు, యువకులు కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు.
గుంటూరులో కాగడాల ప్రదర్శనలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరి, పార్టీ నేత అప్పిరెడ్డి తదితరులు
చంద్రబాబు దిష్టిబొమ్మతో శవయాత్ర
ప్రతిపక్ష నేత చంద్రబాబు వికేంద్రీకరణకు అడ్డు తగులుతున్నారంటూ కర్నూలులో ఆయన దిష్టిబొమ్మతో శవయాత్ర, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ పాల్గొన్నారు. జిల్లాలోని ఆలూరు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు, బనగానపల్లె తదితర ప్రాంతాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగాయి. అనంతపురం జిల్లాలో పలుచోట్ల కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు, మార్కాపురం, గిద్దలూరుల్లో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీల్లో ఎమ్మెల్యేలు కుందురు నాగార్జునరెడ్డి, అన్నా వెంకట రాంబాబు పాల్గొన్నారు. అద్దంకి, జరుగుమల్లి, టంగుటూరు, కొండపి, పెద్దారవీడు, పెద్దడోర్నాలలో కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట, గూడూరు, పొదలకూరుతోపాటు నెల్లూరు నగరంలోనూ కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. గుంటూరు జిల్లా బాపట్ల, నరసరావుపేట, చిలకలూరిపేట, గుంటూరులో విద్యార్థులు, ప్రజలు, వివిధ సంఘాల నాయకులు కొవ్వొత్తుల ప్రదర్శనలు చేశారు. ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, షేక్ మొహమ్మద్ ముస్తఫా, మద్దాళి గిరిధర్, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిడుగురాళ్లలో రిలే దీక్ష నిర్వహించారు. కృష్ణా జిల్లా కైకలూరు, బంటుమిల్లి, గన్నవరం, తిరువూరు, విజయవాడ నగరంలో కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగాయి. ఎమ్మెల్యేలు డి.నాగేశ్వరరావు, జోగి రమేష్ పాల్గొన్నారు.
ఉత్తరాంధ్రలో..
పాలన విక్రేందీకరణకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లా అంతటా ర్యాలీలు, మానవహారాలు కొనసాగాయి. శ్రీకాకుళంలో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి పాల్గొన్నారు. ఇదే జిల్లాలోని పాలకొండ, పాతపట్నం, రణస్థలం, నరసన్నపేట, టెక్కలి, తదితర ప్రాంతాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం, బొబ్బిలి, నెల్లిమర్ల, సాలూరు, కురుపాం, ఎస్‌కోట, విజయనగరం నియోజకవర్గాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగాయి. బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు పాల్గొన్నారు. విశాఖ జిల్లాలో కాగడాల ప్రదర్శనలు, మానవహారాలు జరిగాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలోని అక్కయ్యపాలెం, విశాఖ సౌత్, భీమిలి, గాజువాక, పెందుర్తి, అరకు, హుకుంపేట, డుంబ్రిగూడ, పాడేరు, పాయకరావుపేట, మునగపాకలో, దేవరాపల్లి ప్రాంతాల్లో కొవ్వొత్తులు, కాగడాల ప్రదర్శనలు నిర్వహించారు.
కాశీలోనూ..
తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ తరఫున మొక్కులు తీర్చుకునేందుకు కాశీ వెళ్లిన పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, పార్టీ నాయకులు మట్టపర్తి మురళీకృష్ణ, మిండకుదుటి మోహన్ తదితరులు శుక్రవారం కాశీలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. జిల్లాలోని కరపలో నిర్వహించిన ర్యాలీలో కాకినాడ ఎంపీ వంగా గీత పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో కాపు కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. సర్పవరం జంక్షన్, ముమ్మిడివరంలలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు, భీమవరం, జంగారెడ్డిగూడెం, పోలవరం, నల్లజర్ల, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, భీమడోలులో కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment