
సాక్షి, గుంటూరు: యావత్ దేశాన్ని కుదిపేసిన షాద్‌నగర్ దిశ అత్యాచారం, హత్య ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నటుడు సుమన్ మండిపడ్డారు. మహిళలపై అత్యాచారం చేసిన వారికి రెండు దెబ్బలు చాలనటం దారుణమన్నారు. అలాంటి ఘటనలు వారింట్లో జరిగితే పవన్ ఇలాగే అంటారా అని ప్రశ్నించారు. గురువారమిక్కడ సుమన్ మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనల్లో బాధితుల ఆవేదనను అర్థం చేసుకుని మాట్లాడాలని పవన్‌కు హితవు పలికారు. అదే విధంగా అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా దిశ ఘటన గురించి పవన్ మాట్లాడుతూ... ‘వైద్యురాలిపై అత్యాచారం చేసిన నలుగురిని జైల్లో పెడితే.. జైలు దగ్గరకు వేలమంది వెళ్లి.. ఉరితీయాలని, చంపేయాలని అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో ఓ జడ్జి రేప్ కేసు గురించి మాట్లాడుతూ మగవాళ్ల మర్మాంగాలను కోసేయండన్నారు. అంత స్థాయికి ఎందుకు తీసుకువెళుతున్నారు. ఆడపిల్ల బయటకువెళ్లి ఇంటికి తిరిగిరాకపోతే.. ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే.. చేసిన అబ్బాయిని రెండు బెత్తం దెబ్బలు చెమ్డాలు ఊడిపోయేలా కొట్టాలి. అందరూ చూస్తుండగా కొట్టాలి’ అని పవన్ పేర్కొన్న విషయం తెలసిందే. ఈ క్రమంలో పవన్ వ్యాఖ్యలపై మహిళలు, మేధావులు, రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. (దిశ కేసు.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు)
ఇక దిశ ఘటనపై తిరుపతితో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వివిధ రాజకీయ పక్షాలు, లాయర్లు, డాక్టర్లు ఇందులో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు దిశా ఘటన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులను నాలుగు దెబ్బలు వేస్తే సరిపోతుందని చెప్పటం పవన కల్యాణ్ సిగ్గు చేటని మండిపడ్డారు.